కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌పై ఈనెల 22న తుది తీర్పు

Wait 5 sec.

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన .. తీర్పును వాయిదా వేసింది. ఈనెల 22వ తేదీన తుది తీర్పును వెలువరించనున్నట్లు తెలిపింది. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ వీడలేదు. ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం తీర్పును వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం.. వాటి నిర్వహణలో జరిగిన అవకతవకలు జరిగాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ కమిషన్ చెల్లుబాటుపై హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేయగా.. వాటిపై నేటితో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ఈ నెల 22వ తేదీన తుది తీర్పు వెలువరించనున్నట్లు హైకోర్టు తేల్చి చెప్పింది.2024 మార్చి 14వ తేదీన జీవో నంబర్ 6ను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన జీవోను సవాల్ చేస్తూ రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు, అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి సహా పలువురు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో రూల్స్‌ను ఉల్లంఘించారంటూ పిటిషనర్లు వ్యాఖ్యానించారు. తమపై అభియోగాలు మోపే ముందు.. తమ వైపు నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సాగుతోందని హైకోర్టుకు తెలిపారు.అయితే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే తన రిపోర్టును తయారు చేసిందని సర్కార్ హైకోర్టుకు తెలిపింది. విచారణలో భాగంగా పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి.. రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తున్నామని.. అందుకే కమిషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం.. అటు ప్రభుత్వం తరఫు వాదనలు, ఇటు పిటిషనర్ల తరఫు వాదనలను సుదీర్ఘంగా విన్న అనంతరం.. ఇవాళ ఇవ్వాల్సిన తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఈనెల 22వ తేదీన ఏం తీర్పు రానుంది అనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ వీడనుంది.