ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ టీమ్.. ఇప్పుడు ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే చాలు అన్నట్టుగా తయారయింది. ఐపీఎల్ 2026లో మంచి కమ్ బ్యాక్ ఇస్తుందనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయి ఢీలా పడింది. సంజూ శాంసన్ సీఎస్కేలో వస్తే అన్నీ విజయాలే అనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. బ్యాటింగ్ లైనప్ ఫర్వాలేదు అనిపిస్తున్నా.. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగల బౌలింగ్ లేకపోవడమే చెన్నైకి శాపంగా మారింది. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఈ రోజు నాలుగో మ్యాచ్‌కి సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. అందులో సీఎస్కే 19 మ్యాచ్‌లలో విజయం సాధించగా, ఢిల్లీ 12 మ్యాచ్‌లలో గెలిచింది. అయితే చివరగా జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ ఢిల్లీ క్యాపిటల్సే విజయం సాధించడం విశేషం. 2024, 2025లో వరుసగా గెలిచిన ఢిల్లీ.. 2023లో రెండు మ్యాచ్‌లు, 2022లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరాజయం పాలయింది. ఇక ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ రెండు గెలిచి, ఒక దాంట్లో ఓడింది. గుజరాత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆల్‌మోస్ట్ గెలిచిన ఢిల్లీ ఆఖరి బంతికి ఓడిపోయింది. దాంతో సీఎస్కేతో మ్యాచ్ రసవత్తర సాగే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనారుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అంచనాకేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, విప్‌రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి.నటరాజన్, ముకేశ్ కుమార్.