: ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. ఒక రోజు లాభాలు.. మరో రోజు నష్టాలు అన్నట్లుగా సాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క ప్రకటనతో తారుమారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ముగుస్తుందని సంకేతాలు ఇస్తే వెంటనే క్రూడాయిల్ ధరలు తగ్గి స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. మళ్లీ ఏదైనా దాడులు చేస్తున్నట్లు ప్రకటిస్తే.. క్రూడాయిల్ ధరలు అమాంతం పెరిగి స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనం అవుతున్నాయి. . ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారు. అయితే చాలా వరకు స్టాక్ మార్కెట్లలో స్వల్ప కాలం కంటే దీర్ఘకాలంలోనే స్టాక్స్‌తో మంచి లాభాలు అందుకోవచ్చని చెబుతుంటారు. ఇక్కడ లాంగ్ రన్‌లో స్టాక్ ధర పెరగడంతో మాత్రమే కాదు.. ఇంకా కంపెనీలు తమ మూలధన లాభాల నుంచి ప్రకటించే బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్, డివిడెండ్ వంటివి అదనంగా లాభాల్ని వచ్చేలా చేస్తాయి. ఇప్పుడు గోల్డ్ లోన్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 30 చొప్పున డివిడెండ్ చెల్లించనుంది. ఈ మేరకు 2026, ఏప్రిల్ 10న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయించారు. ఇది ఫేస్ వాల్యూతో చూస్తే దాదాపు 300 శాతం డివిడెండ్ కావడం విశేషం. ఈ డివిడెండ్‌కు అర్హత సాధించేందుకు రికార్డు తేదీ ఏప్రిల్ 17 గా ఉంది. అంటే ఆ తేదీలోపు ఈ సంస్థ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ వస్తుందన్నమాట. డివిడెండ్ తేదీ ప్రకటించినప్పటి నుంచి 30 రోజుల్లోపు పేమెంట్ చేస్తామని ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ. 30 చొప్పున.. 10 షేర్లు కలిగి ఉన్న వారికి రూ. 300 వస్తుంది. అదే 100 షేర్లు ఉంటే.. రూ. 3 వేలు వస్తుంది. ఇది నేరుగా షేర్ హోల్డర్ల బ్యాంక్ అకౌంట్లలో జమవుతుంది. ఇక ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్ విషయానికి వస్తే ఏప్రిల్ 10న 2.67 శాతం పెరిగి రూ. 3568.10 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్ విలువ రూ. 1.44 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 4,149.50 కాగా.. కనిష్ఠ ధర రూ. 1965 గా ఉంది. ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ ధర 77 శాతం పెరిగింది. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.