కడప బాలిక హత్య కేసు.. నిందితుడు వెంకటేష్‌పై పోలీసుల కాల్పులు

Wait 5 sec.

కడప జిల్లా ఖాజీపేటలో బాలికను గొంతుకోసి హత్య చేసిన కేసులో నిందితుడు వెంకటేష్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అతడ్ని మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా వెంకటేష్ ఎస్కార్ట్‌గా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. పారిపోతున్న నిందితుడు వెంకటేషన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.. ఈ క్రమంలో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా నిందితుడు ఎదురు తిరగడంతో అతడి కాళ్లపైకి పోలీసులు కాల్పులు జరిపారు.. వెంకటేష్ గాయపడగా కడప రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.కడప జిల్లా ఖాజీపేట అగ్రహారానికి చెందిన బాలిక ఇంటర్‌ పూర్తి చేసింది.. ఖాజీపేట మండలం ఆంజనేయ కొట్టాలుకు చెందిన వెంకటేష్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. శుక్రవారం రోజు ఎవరూ లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఆ బాలికను ఒత్తిడి చేశాడు.. ఆమె ఒప్పుకోకపోవడంతో ఇద్దరు గొడవపడ్డారు. వెంకటేష్ తన వెంట తెచ్చుకున్న కత్తి తీసుకుని బాలిక గొంత కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తండ్రి, స్థానికులు కలిసి బాలికను కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు.. మార్గ మధ్యలో బాలిక వెంకటేష్‌తో పాటూ మరో యువకుడి పేరును తండ్రికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బాలిక చెన్నూరు సమీపంలోకి వెళ్లగానే ప్రాణాలు కోల్పోయింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌ మార్చురీకి తరలించారు. బాలిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు. నిందితుడు వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారంతా కడప-కర్నూలు నేషనల్ హైవేపై ఆందోళనకు దిగారు. మూడు గంటలకుపైగా బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆందోళకు దిగినవారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు.. కానీ వారు వినకపోవడంతో చెదరగొట్టారు. నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుడు పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు.