ధృవ్ జురేల్.. హీరో ఆఫ్ రాజస్థాన్! ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్!

Wait 5 sec.

రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ బోన్ మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై టార్గెట్ ఛేజింగ్ మ్యాచ్‌లో అందరూ వైభవ్ సూర్యవంశీనే ఆకాశానికి ఎత్తుతున్నా.. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ గెలుపునకు కారణం ధృవ్ జురేలే. వైభవ్ మంచి ఆరంభం ఇచ్చినా.. మిడిలార్డర్‌లో మ్యాచ్‌ని నిలబెట్టింది మాత్రం జురేలే. ఆఖరి వరకూ క్రీజులోని నిలబడి మ్యాచ్‌ని ముగించి రాజస్థాన్‌కు వరుసగా నాలుగో విజయం అందించాడు. రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 3 బ్యాటర్‌గా ధృవ్ జురేల్ తనను తాను నిరూపించుకున్నాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ధృవ్ జురేల్ మ్యాచ్ ముగిసే వరకూ క్రీజులోనే కొనసాగాడు. పవర్ ప్లేలో వైభవ్‌తో కలిసి విధ్వంసం సృష్టించిన ఇదే జురేల్.. వరుసగా మూడు వికెట్లు పడిన తర్వాత మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను కూడా నిలబెట్టాడు. 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌ను ధృవ్ జురేల్ నిలబెట్టాడు. వైభవ్ సూర్యవంశీ - జురేల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 129 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ అవుటైన వెంటనే.. షిమ్రోన్ హెట్మెయర్ కూడా వికెట్ కోల్పోయాడు. మరో ఐదు పరుగుల తర్వాత రియాన్ పరాగ్ పెవిలియన్ బాట పట్టాడు. దాంతో 9.4 ఓవర్లలోనే రాజస్థాన్ 134 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. స్కోర్ భారీగానే ఉన్నప్పటికీ మరో వికెట్ పడితే మ్యాచ్‌ని నిలబెట్టే బ్యాటర్ మాత్రం రాజస్థాన్‌కు లేడు. దాంతో ఆ సమయంలో రవీంద్ర జడేజాతో కలిసి నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ 50 బంతుల్లో 68 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించారు. ధృవ్ జురేల్ 43 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 81 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రవీంద్ర జడేజా 25 బంతుల్లో 1 ఫోర్‌తో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ధృవ్ జురేల్ ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 9 బంతుల్లో 18 పరుగులు చేసిన ఈ ఆటగాడు.. గుజరాత్ టైటాన్స్‌పై 42 బంతుల్లో 75 పరుగులు బాదాడు. ముంబైపై రెండు పరుగులకే అవుటైనా.. ఇప్పుడు ఆర్సీబీపై 43 బంతుల్లో 81 పరుగులతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 176 రన్స్‌తో టాప్ 3లో నిలిచాడు.