తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదాలను తీసుకుంటారు. గత ఏడాది కాలంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు భారీగా పెరిగాయి. 2025-2026 వార్షిక ఏడాదిలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదాలు విక్రయించారు. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు మొత్తం 13,95,43,231 లడ్డూలను భక్తులకు విక్రయించారు. 2024-2025 విషయానికి వస్తే 12,18,53,535 లడ్డూలను అమ్మారు. 2024-2025తో పోలిస్తే.. 2025-2026 (ఏడాదిలో) అదనంగా 1.76 కోట్ల లడ్డూలను విక్రయించారు. ప్రస్తుతం టీటీడీ రోజుకు 4 లక్షల లడ్డూలను తయారు చేస్తోంది.. శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వడంతో పాటు అదనంగా కావాలనుకునే వారికి రూ. 50కి ఒకటి చొప్పున లడ్డూ అందిస్తోంది. 2025-2026 వార్షిక ఏడాదిలో లడ్డూల విక్రయాల ద్వారా రూ. 567 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుంచి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి మొదలైనవన్నీ పవిత్రజలంతో శుద్ధి చేయబడతాయి. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. ఈ ఉత్సవాల నిర్వహణ కారణంగా ఏప్రిల్ 28 మరియు ఏప్రిల్ 30 నుంచి మే 02వ తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.