ఏపీలో ఈ నెల 15 నుంచి చేపల వేటపై నిషేధం.. మత్స్యకారులకు రూ.20వేలు సాయంపై కీలక అప్డేట్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా 61 రోజుల పాటూ చేపల వేటపై నిషేధం ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సముద్రంలో చేపలు, ఇతర మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి.. అందుకే ఈ సమయంలో బోట్లు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రతి ఏటా నిషేధం అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5వేలు జరిమానా విధిస్తారు.. అలాగే వలలు స్వాధీనం చేసుకుని బోటు రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. వేట విరామ సమయంలో మత్స్యకారులు సహకరించాలని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఈ చేపల వేట విరామ సమయంలో.. మత్స్యకారుల సేవలో పథకం కింద ఏడాదికి రూ.20వేలు అందిస్తోంది. గతేడాది అర్హులైన మత్స్యకారులకు ఈ డబ్బులు అకౌంట్‌‌లలో జమ చేశారు. ఈ మేరకు మత్స్యకారులకు రూ.20వేల సాయం అందించేందుకు లబ్ధిదారుల వివరాలను సేకరించనున్నారు. ఈ నెల 17 నుంచి అర్హులైన మత్స్యకారుల వివరాలు సేకరించనున్నారు. అంతేకాదు ప్రభుత్వం వేటకు వెళ్లే బోట్లకు డీజిల్‌పై సబ్సిడీ కూడా అందిస్తోంది. అలాగే రాయితీపై మత్స్యకారులకు ఇంజిన్, తెప్ప, వల కూడా అందిస్తున్నారు. మత్స్యకారులకు 40% రాయితీపై మోటార్ ఇంజిన్లు అందజేస్తున్నారు. అలాగే పీఎంఎంఎస్‌వై (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన) కింద ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని కూడా పెంచారు. గతంలో ప్రమాద బీమా రూ.2 లక్షలు ఉండగా.. దానిని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణాలు, ప్రమాదాల వల్ల మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కార్మిక శాఖ ద్వారా రూ.2 లక్షల పరిహారం ఇస్తారు. ఈ బీమా సౌకర్యం పొందాలంటే మత్స్యకార సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్స్, ఆధార్ కార్డు ఉండాలి.. మత్స్యశాఖ అధికారుల దగ్గర పేర్లు నమోదు చేయించుకోవాలి. మత్స్యకారుడు చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, పంచనామా పత్రం, రేషన్ కార్డు, మత్స్యకార సహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మాన పత్రాలను సమర్పించాలి. మరిన్ని వివరాలకు దగ్గరలోని మత్స్యశాఖ అధికారులు.. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 15 నుంచి చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. అలాగే ఏపీ ప్రభుత్వం మత్స్యకారుల సేవలో పథకం కింద రూ.20వేలు సాయం చేయనుంది.