సాగరతీరం విశాఖపట్నం ప్రజలను ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే విశాఖవాసులు ఏకంగా రూ.28 కోట్లు పోగొట్టుకున్నారు. జనవరి నెల నుంచి మార్చి నెల వరకూ విశాఖలోని పలు ప్రాంతాల ప్రజలు సైబర్ మోసాలలో రూ. 28 కోట్లు కోల్పోయారు. అయితే విశాఖవాసులు సైబర్ నేరాల ద్వారా కోల్పోయిన 28 కోట్ల రూపాయల్లో.. 70 శాతానికి పైగా డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలలోనే కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో విశాఖపట్నంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు సైబర్ మోసాలకు సంబంధించి 400 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు 60 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ మోసాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులలో సారూప్యత ఉన్న ఐదు నుంచి పది కేసులను కలిపి ఒక ఎఫ్ఐఆర్ చొప్పున నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. జనవరి నెలలో విశాఖవాసులు రూ. 12 కోట్లు కోల్పోయారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లో రూ. 8 కోట్ల చొప్పున నష్టపోయారు. సైబర్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని బ్యాంక్ అకౌంట్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ఇతర ఏజెన్సీల సమన్వయంతో బాధితుల ఆర్థిక నష్టాన్ని కొంతమేరకు తగ్గిస్తున్నారు. 28 కోట్ల రూపాయలలో సగం డబ్బును క్రిప్టో కరెన్సీ మోసాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మోసాల ద్వారా కొల్లగొట్టినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ కారణంగా ప్రజలు ఇలాంటి మోసాలకు గురౌతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో ఉద్యోగులు, వ్యాపారులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ మోసాల ద్వారా కొల్లగొట్టిన డబ్బులో 20 శాతం డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి చోరీ చేసిందని వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు.ఉద్యోగాల పేరుతో మోసాలు, ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్స్ వంటి మోసాలకు కూడా పాల్పడుతున్నట్లు గుర్తించారు. సైబర్ మోసగాళ్లు వృద్ధులను ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తొందరగా నమ్మే తత్వం, సాంకేతికతపై సరైన అవగాహన లేకపోవటం, ఒంటరితనం వంటి కారణాలతో వృద్ధులనే ఈ ముఠాలను టార్గెట్ చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే సమాచారం అందించాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. గంటలోపు సమాచారం అందిస్తే, బాధితులు డబ్బును తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు.