హైదరాబాద్ నగరం దోమలకు స్వర్గధామంగా మారిందని, పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూ సరూర్ నగర్‌లో వినూత్న నిరసన తెలిపారు. గత కొంతకాలంగా సరూర్ నగర్ పరిధిలో దోమల బెడద ఎక్కువైందని.. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని బీజేపీ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. 'మచ్చర్ కే నామ్ పే బిక్షం దేనా..' అంటూ ఆమె భిక్షాటన చేశారు. అలా సేకరించిన చిల్లర డబ్బులతో ఒక దోమల తెరను కొనుగోలు చేశారు. అనంతరం ఎల్బీనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని.. అక్కడ ఒక దిష్ఠిబొమ్మకు ఆ దోమల తెరను కప్పి అధికారుల తీరును ఎండగట్టారు. అధికారులకు కనువిప్పు కలిగించడమే ఈ వినూత్న నిరసన ఉద్దేశ్యమని శ్రీవాణి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురువుతోందని ఆమె ఆరోపించారు. సాధారణంగా వర్షాకాలం ముగిసిన తర్వాత, వేసవి ప్రారంభంలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు యాంటీ లార్వా చర్యలు చేపట్టాలని.. అలాగే క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని అన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పారిశుధ్య పనులు సరిగ్గా సాగకపోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.'సరూర్‌నగర్‌లో దోమల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. కానీ ఈ పాలనలో అధికారులు మాత్రం పట్టించుకోకుండా ప్రజలను బాధల్లోకి నెట్టేస్తున్నారు. యాంటీ లార్వా చర్యలు లేవు.. ఫాగింగ్ లేదు.. పనులు ఏవీ జరగకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉండటం నిజంగా సిగ్గుచేటు! కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ గారి పాలనలో ప్రజల ఆరోగ్యం ఇలా నిర్లక్ష్యం చేయబడుతుందా? వెంటనే యాంటీ లార్వా చర్యలు చేపట్టాలి. రెగ్యులర్ ఫాగింగ్ నిర్వహించాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇది కేవలం నిరసన కాదు.. ప్రజల బాధల గళం!' అని శ్రీవాణి ట్వీట్ చేశారు. దోమల సమస్యపై ఇటీవల ఎల్బీనగర్ సైతం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఫాగింగ్ మిషన్, దోమ తెరలతో ప్రెస్ మీట్ పెట్టారు. దోమలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటుందనని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అనారోగ్యం బారిన పారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతూ ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దోమల నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.