భారీగా పెరిగిన బంగారం దిగుమతులు.. విలువ రూ. 6.41 లక్షల కోట్లు.. అక్కడి నుంచే ఎక్కువ!

Wait 5 sec.

Gold Prices: భారతదేశంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళలు.. బంగారు ఆభరణాల్ని విపరీతంగా కొనుగోలు చేస్తుంటారు. పండగలు, శుభకార్యాలు సహా ఇతర వేడుకల వేళ ఎక్కువగా కొని ధరించాలని చూస్తుంటారు. బంగారు ఆభరణాలు మహిళల అందాన్ని మరింత పెంచుతాయని కూడా చెప్పొచ్చు. అయితే గతేడాది బంగారం రేట్లు.. అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. 2025 క్యాలెండర్ ఇయర్‌లోనే బంగారం ధర ఏకంగా 70 శాతానికిపైగా పెరిగింది. అయితే ధరలు ఈ స్థాయిలో పెరిగినప్పటికీ.. మాత్రం అస్సలు తగ్గలేదు. రికార్డు స్థాయిలో పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే దేశంలోకి 69 బిలియన్ డాలర్ల విలువైన బంగారం అధికారికంగా దిగుమతి అయింది. ఇది భారత కరెన్సీలో చూసినట్లయితే ఏకంగా రూ. 6.41 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఫిబ్రవరిలో మన దేశంలోకి దిగుమతి అయిన బంగారం విలువ 53.52 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఇది భారత కరెన్సీలో చూస్తే దాదాపు రూ. 4.97 లక్షల కోట్ల వరకు ఉంటుంది. దీంతో వార్షిక ప్రాతిపదికన చూస్తే బంగారం దిగుమతుల విలువ రికార్డు స్థాయిలో 29 శాతం వరకు పెరిగింది. ఇక్కడ బంగారం దిగుమతుల విలువ ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం.. పెరగడమే. దానికి అనుగుణంగానే దిగుమతుల బిల్లు పెరిగిపోయింది. ఈ క్రమంలో భారతదేశ వాణిజ్య లోటు కూడా పెరిగింది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే.. వాణిజ్య లోటు పెరుగుతుందని చెప్పొచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాదు. ఫలితంగా భారతదేశ వాణిజ్య లోటు 261.80 బిలియన్ డాలర్ల నుంచి 310.60 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం.. ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఈ దేశం నుంచి మన దేశంలోకి వచ్చిన బంగారం దిగుమతుల వాటా 40 శాతంగా ఉంది. యూఏఈ వాటా 16 శాతంగా ఉండగా.. దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. భారతదేశ మొత్తం దిగుమతుల్లో పసిడి దిగుమతుల వాటా సుమారు 5 శాతం వరకు ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇదే 11 నెలల సమయంలో వెండి దిగుమతుల విలువ చూస్తే 143 శాతం వరకు పెరిగి 11.43 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది భారత కరెన్సీలో రూ. 1.06 లక్షల కోట్లుగా ఉంది. వెండిని ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు.