వీడని ఉత్కంఠ.. ఎటూ తేలని ఇరాన్-అమెరికా చర్చలు.. డిమాండ్లపై వెనక్కి తగ్గని రెండు దేశాలు

Wait 5 sec.

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో ఉత్కంఠ వీడలేదు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ బృందాల మధ్య.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలో తొలి విడత 2 గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇరు పక్షాలు ముగించాయి. కేవలం శాంతి ఒప్పందానికి సంబంధించిన నోట్స్‌ను ఇరాన్, అమెరికా ప్రతినిధులు మార్చుకున్నారు. అయితే ఇవాళ మరో విడత చర్చలు జరపాలను ఇరు పక్షాలకు పాకిస్తాన్ సూచించింది. ఇరాన్ పెట్టిన కండీషన్లకు వారు తగ్గకపోవడం.. అమెరికా చేస్తున్న డిమాండ్లపై వాళ్లు వెనకడుగు వేయకపోవడం వల్ల చర్చలు ఫలప్రదం కాలేదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.శనివారం సాయంత్రం ఇస్లామాబాద్‌లోని సెరెనా హోటల్‌లో ఇరాన్, అమెరికా మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ తొలి రౌండ్ చర్చల్లో ఎలాంటి నిర్ణయానికి రాకుండానే రెండు దేశాలు ముగించాయి. మొదట పరోక్షంగా రెండు దేశాలు చర్చలు జరపాలను నిర్ణయించినప్పటికీ.. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన తర్వాత నేరుగా చర్చలు జరిపారు. అయితే ఎలాగైనా ఈ చర్చలు సఫలమై.. ఏదో ఒక నిర్ణయానికి వచ్చేలా రెండు దేశాలను ఒప్పించేందుకు పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమెరికా చేస్తున్న ప్రధాన డిమాండ్లలో.. ఇరాన్ వద్ద ఉన్న శుద్దిచేసిన యురేనియంను వదులుకోవాలనేది కీలకంగా మారింది. అదే సమయంలో ఇరాన్ కూడా ఖతార్ సహా ప్రపంచ దేశాల్లో తమ దేశానికి చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు ఉన్నాయని.. ప్రస్తుతం వాటిని ఫ్రీజ్ చేశారని.. వెంటనే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. అయితే ఈ డిమాండ్‌కు అమెరికా ఒప్పుకున్న తర్వాతే చర్చలు ప్రారంభమైనట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా హర్మూజ్ జలసంధిపై తమ పట్టును అమెరికా గుర్తించాలని డిమాండ్ చేస్తోంది. వీటితోపాటు గత కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని పేర్కొంటోంది.మరోవైపు.. పాక్ వేదికగా ఇరాన్, అమెరికా చర్చలు జరుగుతుండగానే.. అమెరికా అధ్యక్షుడు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్‌ల వర్షం కురిపించారు. రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపిన ట్రంప్.. చర్చలు ఎలా సాగుతాయనే దానిపై తనకు ఎలాంటి అవగాహన లేదని పేర్కొన్నారు. కానీ ఇరాన్ ఎంత చిత్తశుద్ధితో ఉందనేది మాత్రం వెంటనే చెప్పేస్తానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అతి త్వరలోనే హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని మరో పోస్ట్ పెట్టారు. ఇక ఇరాన్‌పై తీవ్రంగా విరుచుకుపడిన ట్రంప్.. అది ఒక విఫల దేశం అని వ్యాఖ్యలు చేశారు. దౌత్య ప్రయత్నాలు విఫలమైతే అమెరికా తన విధానాన్ని మార్చుకునేందుకు రెడీగా ఉందని.. అవసరమైతే కఠినమైన రియాక్షన్ ఉంటుందని తీవ్ర హెచ్చరికలు చేశారు.