ఇరాన్-అమెరికా మధ్య పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన సుదీర్ఘ చర్చలు.. సఫలం కాలేదు. రెండు దేశాల మధ్య శనివారం సాయంత్రం నుంచి సాగుతున్న చర్చల్లో ఏకాభిప్రాయం రాకపోవడంతో చర్చలు విఫలమైనట్లు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వెల్లడించారు. తమ బృందం చర్చలను మధ్యలోనే వదిలేసి.. అమెరికా వెళ్లిపోతున్నట్లు మీడియాకు వివరించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహజాబ్ షరీఫ్.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. చర్చల తర్వాత బయటికి వచ్చిన జేడీ వాన్స్‌ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 21 గంటల పాటు ఇరాన్‌తో తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చాలా కీలక విషయాలపై రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు చర్చించినట్లు పేర్కొన్నారు. కానీ ఈ సుదీర్ఘ చర్చల్లో రెండు వైపులా ఎవరూ తగ్గకపోవడంతో.. ఎలాంటి ఒప్పందం చేసుకోలేకపోయామని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరేందుకు తాము కొన్ని షరతులు విధించామని.. అయితే ఇరాన్‌ మాత్రం వాటికి ఒప్పుకోలేదని జేడీ వాన్స్ చెప్పారు. ఈ శాంతి చర్చల్లో అమెరికా ప్రతినిధులు చాలా సానుకూలంగా వ్యవహరించినట్లు చెప్పుకొచ్చారు. యుద్ధాన్ని ముగించి.. ఒప్పందం కుదుర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో తాము పాకిస్తాన్‌కు వచ్చామని.. శాంతి ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసినట్లు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. కానీ చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ శాంతి ఒప్పందం కుదరకపోవడం అమెరికా కంటే.. ఇరాన్‌కే బ్యాడ్ న్యూస్ అని అభివర్ణించారు. పాకిస్తాన్‌లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకుండానే తాము తిరిగి అమెరికాకు వెళ్తున్నట్లు ప్రకటించారు.రానున్న రోజుల్లో అణ్వాయుధాలు తయారు చేసుకోబోమని, వాటిని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటామని ఇరాన్‌ నుంచి స్పష్టమైన హామీని అమెరికా కోరుతున్నట్లు జేడీ వాన్స్‌ తెలిపారు. అయితే దానికి ఇరాన్‌ అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ఒప్పందం కుదరకపోయినప్పటికీ.. తాము చేసిన అణు నిరాయుధీకరణ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఇరాన్‌ను ఇంకొంత సమయం ఇస్తున్నట్లు జేడీ వాన్స్‌ వెల్లడించారు. పాక్‌లో ఇరాన్ ప్రతినిధులతో చర్చల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తాము ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నామని స్పష్టం చేశారు. అయితే అమెరికాతో పాకిస్తాన్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంపై అటు ఇరాన్‌ కూడా స్పందించింది. హర్మూజ్‌ జలసంధి పూర్తి పట్టు ఇరాన్‌కే ఉండాలి.. ఇరాన్‌ అణు హక్కులు వంటి ముఖ్యమైన అంశాలపై అమెరికా విధిస్తున్న డిమాండ్లు.. వాటికి తాము ఒప్పుకోకపోవడం కారణంగానే చర్చలు ఎటూ తేలకుండా ప్రతిష్ఠంభన నెలకొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.