సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త రకాలుగా అమాయక ప్రజలను మోసం చేస్తూ.. కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారు. ఏది ట్రెండ్‌లో ఉంటే దాన్ని అదునుగా చేసుకుని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంటున్న సరికొత్త సైబర్ నేరాలపై .. సోషల్ మీడియా వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ నీటి బకాయిల పేరుతో నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ.. వారికి వివరాలు తీసుకుని.. నిలువునా దోచేస్తున్నారని వెల్లడించారు.హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పేరుతో ఇటీవలి కాలంలో నగరంలో జరుగుతున్న సైబర్ మోసాలను గుర్తించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరైనా ఫోన్, మెసేజ్ చేసి.. వాటర్ బిల్లులు చెల్లించలేదని.. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయని చెబుతూ.. నీటి కనెక్షన్ కట్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి మెసేజ్, కాల్స్‌కు భయపడవద్దని వెల్లడించారు. అలా ఎవరు పడితే వారు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని హితవు పలికారు. నీటి బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల్లో ఉండే భయాన్ని పెట్టుబడిగా పెట్టి.. వారి పర్సనల్ సమాచారంతోపాటు.. బ్యాంక్ అకౌంట్ డేటాను తీసుకుని.. డబ్బులు దోచుకునే ఇలాంటి తరహా మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ చెప్పారు. ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటేనే.. ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోకుండా.. డబ్బులను రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.మొదట సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి నీటి బిల్లు బకాయి ఉందని.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇలా జనాల్లో భయాన్ని తీసుకువచ్చి.. ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత ‘HMWSSB WATER BILL UPDATE.apk’ అనే పేరుతో ఒక అనుమానాస్పద ఏపీకే లింక్‌ను పంపిస్తున్నారని.. దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారని తెలిపారు. అయితే ఆ యాప్ డౌన్‌లోడ్ చేస్తే.. మన సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుందని సజ్జనార్ వివరించారు. ఇలాంటి నకిలీ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే మన ఫోన్‌ సైబర్ నేరగాళ్ల కంట్రోల్‌లోకి వెళ్తుందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆ తర్వాత ఫోన్ కాల్స్‌, మెసేజ్‌లు, ఓటీపీలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని.. అదే సమయంలో బ్యాంకింగ్ యాప్‌లను కూడా గమనించాలని పేర్కొన్నారు. మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు ట్రాన్సాక్షన్లు చేస్తారని చెప్పారు. దీంతో క్షణాల్లోనే బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పంపించే ఏ ఏపీకే ఫైల్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయకూడదని స్పష్టం చేశారు. నీటి బిల్లులు పెండింగ్‌లో ఉంటే.. ప్రజలు కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారానే చెల్లించాలని హితవు పలికారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే స్పందించకుండా సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఒకవేళ పొరపాటున ఏపీకే ఫైల్ ఓపెన్ చేసినా.. దాని వల్ల డబ్బులు పోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించారు. లేకపోతే ఆన్‌లైన్‌లో cybercrime.gov.in పోర్టల్‌లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.