: కాలం గడుస్తున్న కొద్దీ ఖర్చులు పెరిగిపోతుంటాయి. కాబట్టి.. సంపాదించే మొత్తం అప్పటికి చాలకపోవచ్చు. అందుకే.. భవిష్యత్తు కోసం డబ్బులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెడుతుంటారు. ఇంకా పెట్టుబడికి ఆప్షన్లు కూడా చాలానే ఉంటాయి. లాంగ్ రన్‌లో మెరుగైన రాబడి కోసం చాలా మంది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా సంపద విపరీతంగా పెరుగుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ సగటున వార్షిక ప్రాతిపదికన చాలా వరకు 12 శాతం రిటర్న్స్ ఇస్తుంటాయి. అంతకుమించి కూడా రాబడి అందించేవి చాలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో ఆన్‌లైన్ కాలిక్యులేటర్స్ ద్వారా నెలనెలా ఎంత సిప్ రూపంలో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో తెలుసుకోవచ్చు. ఇంకా చాలా మందికి నిర్దిష్ట లక్ష్యాలు ఉంటాయి. వారి వారి కుటుంబ అవసరాలకు తగ్గట్లుగా ఎంత సమకూర్చుకోవాలో ఒక అంచనా ఉంటుంది. భారతదేశంలో చాలా మందికి రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలని ఉంటుంది. ఇందుకోసం కష్టపడి మరీ పొదుపు చేస్తుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ.. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతూ.. ఓపికతో ఎదురుచూస్తే మంచి రాబడి అందుకోవచ్చు. ఇప్పుడు మీ టార్గెట్ రూ. 1 కోటి అనుకుంటే.. నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎన్నేళ్లు పడుతుందనేది చూద్దాం. నెలకు రూ. 20 వేల చొప్పున ప్రతి నెలా సిప్ పెట్టుబడి పెడితే.. అంచనా వార్షిక రాబడి 12 శాతంగా అనుకుంటే.. 15 ఏళ్లలోనే రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ మీ మొత్తం పెట్టుబడి రూ. 36 లక్షలుగా ఉంటుంది. ఇక వడ్డీ రూపంలో రూ. 64 లక్షలకుపైగా వస్తుంది. ఇలా మొత్తం రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. నెలకు సిప్ మొత్తాన్ని పెంచితే ఇంకా లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవచ్చు. దీనినే స్టెప్ అప్ సిప్ అంటారు. చాలా వరకు ఏటా సిప్ మొత్తాన్ని 10 శాతం మేర పెంచుతుంటారు. ఇదే నెలకు రూ. 20 వేల చొప్పున.. 10 శాతం స్టెప్ అప్ పెట్టుబడితో చూస్తే 12 ఏళ్లలోనే రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ మూడేళ్లు ముందుగానే లక్ష్యాన్ని అందుకుంటారన్నమాట. ఇక్కడ మొత్తం పెట్టుబడి రూ. 51.32 లక్షలు కాగా.. వడ్డీ రూపంలో రూ. 49 లక్షల వరకు వస్తుంది.