భారతదేశంలో అత్యంత కాలుష్యం కలిగిన నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ముందు వరుసలో ఉంటుంది. రాజధాని నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సరి - బేసి విధానం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేసింది. ఢిల్లీలో కాలుష్యానికి చెక్ పెట్టాలంటే.. ప్రజలను పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికిల్ ముసాయిదా పాలసీని (2026-30) ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ ముసాయిదా పాలసీని విడుదల చేశారు. ఇందులో అనేక కీలక ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది (2027) జనవరి ఒకటో తేదీ నుంచి పెట్రోల్‌తో నడిచే త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని.. కేవలం ఎలక్ట్రిక్ త్రీవీలర్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని ప్రతిపాదించారు. 2028 నుంచి పెట్రోల్‌తో నడిచే కొత్త బైక్, స్కూటీలు వంటి టూవీలర్ల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు, కేవలం ఎలక్ట్రిక్ టూవీలర్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. 2028 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎలక్ట్రిక్ మోడల్స్‌ రిజిస్ట్రేషన్‌ను మాత్రమే అనుమతిస్తారు. మరోవైపు ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మళ్లించేందుకు ప్రోత్సాహకాలను కూడా ఈ పాలసీలో దిల్లీ రవాణా శాఖ ప్రతిపాదించింది.రూ.2.25 లక్షల విలువైన ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేసిన వారికి.. ఒక కిలోవాట్అవర్‌కు రూ.10000 నుంచి రూ.30000 వరకూ ప్రోత్సాహకం అందిస్తారు. అలాగే ఎలక్ట్రిక్ త్రీవీలర్ వాహనాలకు మొదటి సంవత్సరం రూ.50వేలు అందిస్తారు. ఆ తర్పాత క్రమంగా తగ్గించుకుంటూ వస్తారు. 30 లక్షల వరకు ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లకు, మార్చి 31, 2030 వరకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములపై వంద శాతం మినహాయింపు లభిస్తుంది. మరోవైపు తమ పాత వాహనాలను తుక్కు కింద మార్చి, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేవారికి కూడా ఈ ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్ ముసాయిదా పాలసీపై ఢిల్లీ ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించిన అనంతరం.. ఎలక్ట్రిక్ వెహికల్ ముసాయిదా పాలసీని రూపొందిస్తారు. ఇది 2030 వరకూ అమల్లో ఉండనుంది. ఢిల్లీ వాయు కాలుష్యంలో 23 శాతం వాటా వాహనాల ఉద్గారాల వలనే అని లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోంది.