ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమారుడు, ఏపీ మంత్రి కార్యాలయం స్పందించంది. నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంగానే ఉన్నారని.. భాస్కరరావు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని.. దయచేసి అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. ఇదిలా ఉంటే నాదెండ్ల భాస్కరావు అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు అక్కడే చికిత్స పొందుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కొందరు భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ప్రచారం చేస్తున్నారు.. దీంతో మంత్రి కార్యాలయం స్పందించింది.. భాస్కరరావు ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చింది.నాదెండ్ల భాస్కరరావు వృత్తిరీత్యా లాయర్.. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భాస్కరరావు 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో ఆయన వెంట నడిచారు. 1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ఎన్టీఆర్ కేబినెట్‌లోనాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్ళిన సమయంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు.. దాదాపు నెలపాటూ సీఎంగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నాదెండ్ల భాస్కరావు సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాదెండ్ల భాస్కరరావు 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. 1998లో ఆయన ఖమ్మం ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. కుమారుడు నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మనోహర్ తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. ఆయన అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.. 2018లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో మనోహర్ తెనాలి నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.. 2024 ఎన్నికల్లో మళ్లీ పోటీచేసి గెలిచి ఏపీ మంత్రి కూడా అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.. కానీ ఆయన రాజకీయంగా అంతగా యాక్టివ్‌గా లేరు.