ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగింది.. మొన్నటి వరకు అక్కడక్కడా వర్షాలతో వాతావరణ చల్లబడగా.. మళ్లీ ఒకటి, రెండు రోజుల నుంచి సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు మండలాల్లో ఎండలు, వేడిగాలుల తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం, హిరమండలం. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం, వంగర మండలాలు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం, గరుగుబిల్లి మండలం, గుమ్మలక్ష్మీపురం మండలం, జియమ్మవలస మండలం, కొమరాడ మండలం, కురుపాం మండలం, పాలకొండ మండలం, పార్వతీపురం మండలం, సీతంపేట మండలం, వీరఘట్టం మండలాలు. పోలవరం జిల్లా చింతూరు మండలం, కూనవరం మండలం, వరరామచంద్రపురం మండలాలు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం, వేలేరుపాడు మండలాలు. ఇలా మొత్తం 19 తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే 35 మండలాల్లో వేడి గాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రతపై విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో వేడి గాలుల ప్రభావం కనిపించింది. శనివారం అత్యధికంగా కడప జిల్లా పొట్టిపాడులో 44.7 డిగ్రీలు.. నెల్లూరు జిల్లాకొమ్మిపాడులో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు, వేడిగాలులు ప్రభావం ఎక్కువగా ఉందని.. బయటకు వెళ్లేప్పుడు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తలకి టోపీ లేదా రుమాలు ధరించాలని సూచించారు. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు, సన్ గ్లాసెస్ ఉపయోగించాలని.. మంచినీరు ఎక్కువగా తాగాలన్నారు. గుండె జబ్బులు, బిపి, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగవద్దని.. సురక్షితంగా ఉండాలన్నారు. రాష్ట్రవ్యా్ప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శనివారం ఏకంగా 200 మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటితే.. ఇప్పుడు ఏకంగా 45 డిగ్రీలకు దగ్గరగా ఉన్నాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.