ఏపీలో కొత్తగా వేసిన రోడ్లు నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం 20 రోజుల క్రితం మేడిచింత ఉలుగువోలుమధ్య తారు రోడ్డు వేశారు. కొత్తగా వేసిన రోడ్డు పెచ్చులుగా ఊడి వస్తోందని ఓ వ్యక్తి ఆరోపించారు.ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దిగారు.. అసలు ఈ రోడ్డు విషయంలో ఏం జరిగిందో తేల్చేందుకు వెళ్లారు. కొంతమంది ఉద్దేశపూర్వంగా దుష్ప్రచారం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. నూతన రహదారుల నాణ్యతకు సంబంధించి ప్రజల్లో అపోహ కలిగే విధంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పందించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతంలో ఇటీవల వేసిన తారు రోడ్డు నాణ్యతపై ఉద్దేశపూర్వకంగా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో కొందరు సర్క్యులేట్ చేస్తున్నారని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ విషయాలను చెప్పుకొచ్చారు. కొత్తగా వేసిన ఆ రోడ్డుకు సంబంధించిన బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించే ముందు నాణ్యతా పరీక్షలు నిర్వహించారన్నారు. రోడ్డు నాణ్యతా పరీక్షలు నిర్వహించే క్రమంలో రోడ్డు మధ్యలో గుంత తీస్తారని.. ఆ నాణ్యతా పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ గుంతలను తాత్కాలికంగా పూడుస్తారన్నారు.కొందరు తాత్కాలికంగా పూడ్చిన ఆ గుంతను, అందులోని మెటీరియల్ ను చూపించి నాణ్యతపై అపోహలు కలిగే విధంగా వీడియో చిత్రీకరించారని ఆరోపించింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. రోడ్లు మాత్రమే కాదు.. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పారదర్శకత, ఉన్నత ప్రమాణాల పట్ల నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలోని సామాజిక తనిఖీ వ్యవస్థ వరుసగా రెండో ఏట కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని.. 100శాతం తనిఖీలు, పర్యవేక్షణ ఉందన్నారు. అపోహలు సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీపడడం లేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎంతో బాధ్యతగా రహదారుల తనిఖీలు, సోషల్ ఆడిట్‌లు పక్కా నిర్వహిస్తూ, అత్యంత పారదర్శకంగా ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తోందన్నారు. సోషల్ ఆడిట్ ప్రక్రియను అత్యంత కఠినంగా అమలు చేస్తోందని.. అంత పారదర్శకంగా ఉండబట్టే సోషల్ ఆడిట్ విభాగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో రాష్ట్రం నిలిచిందన్నారు. గత రెండు రోజులుగా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వార్తలను ప్రచారం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో రోడ్డు నిర్మాణ లోపాల వల్ల కాదని.. నాణ్యతా తనిఖీలలో భాగంగా కట్ చేసిన రోడ్డు భాగమన్నారు. నాణ్యతా ప్రమాణాల పరీక్షలో తొలుత మొదటి పొరను పరిశీలించేందుకు టెస్ట్ కట్ చేస్తారన్నారు. అది పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలు అందుకుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి పొర నిర్మాణం చేపడతారన్నారు. రోడ్డు తుది మెరుగులు దిద్దుకునే వరకు బలాన్ని, మన్నికను, దీర్ఘకాలిక పని తీరుని నిర్ధారించే విధంగా ఈ తనిఖీలు నిర్వహిస్తారన్నారు. నాణ్యతా పరీక్షల కోసం కట్ చేసిన వాటిని రోడ్డుకు దెబ్బ తిన్నట్లు చూపడం ప్రజల్ని తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించాలన్నారు. దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంస్థల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.