చంద్రుడి వద్దకు వెళ్లొచ్చిన నాసా వ్యోమగాములు.. ఆర్టెమిస్‌-2 సక్సెస్ వెనుక భారత సంతతి సైంటిస్ట్

Wait 5 sec.

దాదాపు 50 ఏళ్ల అనంతరం వ్యోమగాములతో చేపట్టిన చంద్రుడి మిషన్ సక్సెస్ అయింది. ఆర్టెమిస్‌-2 ప్రయోగంలో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 10 రోజుల పాటు సాగిన ఈ మిషన్‌లో ఎన్నో కీలక విషయాలను వ్యోమగాములు జాబిల్లి పైనుంచి భూమి మీదికి మోసుకొచ్చారు. ఈ ఆర్టెమిస్-2 ప్రయోగం ద్వారా భూమి నుంచి ఎక్కువ దూరం ప్రయాణించి మరో చరిత్ర సృష్టించారు. అయితే ఈ ఆర్టెమిస్-2 ప్రయోగంలో భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త పాలు పంచుకున్నారు. నాసాలో అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న అమిత్‌ క్షత్రియ అనే భారత సంతతి సైంటిస్ట్ ఈ ఆర్టెమిస్-2 మిషన్‌కు కీలకంగా పనిచేశారు. మేధస్సు.. నలుగురు వ్యోమగాములను చంద్రుడి వైపు తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా భూమికి చేర్చడంలో ఉపయోగపడింది. అమెరికాలోని విస్కాన్సిన్‌లో పుట్టిన అమిత్‌ క్షత్రియ.. బాల్యం నుంచే అంతరిక్ష రంగంపై ఇష్టాన్ని పెంచుకున్నారు. హ్యూస్టన్‌ నగరంలో పెరిగిన అమిత్ క్షత్రియ.. అక్కడ ఉన్న జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో నిర్వహించే రాకెట్‌ ప్రయోగాలను చూసి ఆ ఇష్టాన్నే తన భవిష్యత్‌గా మార్చుకున్నారు.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి మ్యాథ్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేసిన అమిత్‌ క్షత్రియ.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో మాస్టర్స్‌ చేశారు. 2003లో నాసా కాంట్రాక్ట్ సంస్థ అయిన యునైటెడ్‌ స్పేస్‌ అలయన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రోబోటిక్స్, స్పేస్‌క్రాఫ్ట్‌ ఆపరేషన్స్‌ వంటి కీలక విభాగాల్లో పనిచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నిర్మాణంలో భాగంగా రోబోటిక్‌ అసెంబ్లీ విభాగంలో అమిత్ క్షత్రియ సేవలు అందించారు. ఇక 2014 నుంచి 2017 వరకు స్పేస్‌ స్టేషన్‌ ఫ్లైట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అమిత్‌ క్షత్రియ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమ్‌లను మెయింటైన్ చేస్తూ అంతరిక్ష ప్రయోగాలు సక్సెస్‌ఫుల్ కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఐఎస్‌ఎస్‌కు సంబంధించిన వాహన విభాగంలో డిప్యూటీ, యాక్టింగ్‌ మేనేజర్‌గానూ అమిత్ క్షత్రియ పనిచేశారు. 2021లో నాసా హెడ్ క్వార్టర్స్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన ఆయన.. ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ డైరెక్టరేట్‌లో తన సేవలు అందించారు. మనుషులను చంద్రుడి వద్దకు తీసుకెళ్లే స్పేస్ షిప్ అభివృద్ధిలో భాగమయ్యారు. ప్రస్తుతం నాసా అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న అమిత్ క్షత్రియ.. అత్యున్నత సివిల్‌ సర్వెంట్‌గా ఉన్నారు. ఇక నాసా అడ్మినిస్ట్రేటర్‌కి సీనియర్‌ సలహాదారుగా కూడా ఉన్నారు.నాసాలో అమిత్ కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. నాసాకు చెందిన 10 ప్రధాన కేంద్రాల డైరెక్టర్లను సమన్వయం చేసుకోవడం.. నాసా కార్యకలాపాలను పర్యవేక్షించడం ఆయన బాధ్యత. మరీ ముఖ్యంగా ‘మూన్‌ టు మార్స్‌’ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహిస్తున్న అమిత్.. చంద్రుడిపై మనుషులు ఆవాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. భవిష్యత్తులో అంగారక గ్రహంపైకి మానవ యాత్రలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. ఇక అమిత్‌ క్షత్రియ చేసిన కృషికి, ఆయన ప్రతిభను గుర్తించిన నాసా.. ఇప్పటికే అనేక పురస్కారాలు అందించింది. స్పేస్‌ స్టేషన్‌ 50వ యాత్రలో అమిత్ చూపించిన లీడర్‌షిప్‌కు ‘అవుట్‌స్టాండింగ్‌ లీడర్‌షిప్‌ మెడల్‌’ ప్రదానం చేసింది. ఇక వ్యోమగాములు అత్యంత గౌరవంగా భావించే ‘సిల్వర్‌ స్నూపీ’ అవార్డును కూడా అమిత్ దక్కించుకున్నారు.ఈనెల 1వ తేదీన ఒరాయన్ వ్యోమనౌకలో వెళ్లిన నలుగు వ్యోమగాములు.. 24 గంటల పాటు భూకక్ష్యలో గడిపి.. ఆ తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణించారు. అక్కడ 10 రోజులు గడిపిన తర్వాత.. తిరిగి శనివారం ఉదయం 5.38 గంటలకు పసిఫిక్‌ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ అంతరిక్ష యాత్రలో ముగ్గురు అమెరికన్లతోపాటు.. ఓ కెనడియన్ ఉన్నారు. ఈ ఆర్టెమిస్-2 ప్రయోగంలో భాగంగా భూమి నుంచి 4.06 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి.. ఇప్పటివరకూ మనుషులు వెళ్లని, చూడని చంద్రుడి అవతలి వైపునకు ఈ వ్యోమగాములు వెళ్లి వచ్చారు. అక్కడ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని కూడా వారు వీక్షించడం మరో విశేషం.