తెలంగాణలో కొన్ని రోజుల పాటు భీకరమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండలకు తోడు వేడి, ఉక్కపోత ఉండటంతో.. మధ్యాహ్నం పూట బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 2 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఇక రానున్న 10 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఈనెల 22వ తేదీ వరకు తెలంగాణలో భానుడి భగభగలు ఉగ్రరూపం దాల్చుతాయని తెలిపింది. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఆకాశంలో మేఘాలు ఉన్నా ఎలాంటి చల్లదనం ఉండదని పేర్కొంది. 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం పూట ప్రజలు.. బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని తెలిపింది. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఏప్రిల్ 22వ తేదీ వరకు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత నిత్యం పెరుగుతూనే ఉంది. శుక్రవారం రోజున నల్గొండ జిల్లా ఘనపూర్‌లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదు అవుతున్నాయని వెల్లడించింది.