శ్రీశైలం మల్లన్న దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. మల్లన్న క్షేత్రానికి వెళ్లేందుకు ఏపీలోని దోర్నాల వైపు నుంచి వెళ్లాలంటే నేషనల్ హైవే 765 మీదుగా రాకపోకలు కొనసాగుతున్నాయి. అటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే భక్తులు కూడా ఈ హైవే నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే నేషనల్ హైవే 765ను నాలుగు లైన్లుగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విస్తరణ కోసం అటవీశాఖకు సంబంధించిన భూముల్ని సేకరించాలని భావించినా సాధ్యం కాలేదు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. అటవీ భూములు సేకరించకుండా ప్రత్యామ్నాయంగా అటవీ ప్రాంతం మీదుగా సాగే హైవేలో దాదాపు 86 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవని.. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా వాహన రాకపోకలు సాఫీగా సాగిపోతాయంటున్నారు. హైదరాబాద్ వైపు నుంచి ఇటు ఏపీలో దోర్నాల వరకు నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్, నాగార్జునసాగర్‌ శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాలు ఉన్నాయి. అందుకే ఏపీలో 41.39 కిలోమీటర్లు.. తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు కలిపి మొత్తం 86.74 కి.మీ. మేర ఎలివేటెడ్‌ కారిడార్‌ నాలుగు లైన్లుగా ప్లాన్ చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఏపీ పరిధిలో రూ.10,500 కోట్లు.. తెలంగాణ పరిధిలో రూ.8వేల కోట్లు వ్యయం అవుతుందంటున్నారు. ఇప్పటికే కృష్ణా నదిపై ప్రస్తుతం వంతెన ఉంది.. అయితే డ్యామ్‌కు మధ్యలో 450 మీటర్లు కొత్త ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. అలాగే శ్రీశైలం క్రాస్‌ రోడ్‌ దగ్గర నుంచి ఆలయం వరకు 4.33 కిలోమీటర్ల పొడవున స్పర్‌ రోడ్‌ కూడా ప్లాన్ చేశారు.ఇప్పటికే తెలంగాణవైపు ఈ ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రతిపాదనను మోర్త్‌ (కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ) చెందిన ఏసీసీ (అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ) దగ్గరకు చేరింది. ఇటు ఏపీ పరిధిలోని కారిడార్‌కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఏసీసీకి అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ అలైన్‌మెంట్‌కు సంబంధించి.. జాతీయ రహదారులశాఖకు చెందిన అధికారులు అటవీశాఖ నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరారు. అటవీశాఖ అభిప్రాయం, సూచనల తర్వాత మోర్త్‌కు సూచనలు పంపించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ఆంధ్రప్రదేశ్‌లోని దోర్నాల నుంచి.. తెలంగాణలోని బ్రాహ్మణపల్లి వరకు అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకలు వేగంగా సాగుతాయంటున్నారు. అలాగే ప్రస్తుతం శ్రీశైలంకు వెళ్లే ఘాట్ రోడ్డులో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే కనుక వాహనాలు ఏ సమయంలోనైనా రాకపోకలు కొనసాగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.