11 ఓవర్ల మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ముంబై.. రాజస్థాన్ హ్యాట్రిక్ విక్టరీ!

Wait 5 sec.

హై టార్గెట్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తడబడి చిత్తుగా ఓడిపోయారు. 11 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోవడం మొదలుపెట్టింది. మొదటి మూడు ఓవర్లలోనే ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు కోల్పోయారు. దాంతో ముంబై ఓటమి ఖరారయింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విక్టరీలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది.ముంబై ఇండియన్స్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. గువాహటిలో వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్ కాస్త 11 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుని, రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. రాజస్థాన్ యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించడం, జైస్వాల్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 150/3 పరుగులు చేసింది. రాజస్థాన్ అందించిన 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు మొదటి ఓవర్‌లోనే ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్, మూడో ఓవర్‌‌లో రోహిత్ శర్మ అవుటయ్యారు. ర్యాన్ రికెల్టన్ 4 బంతుల్లో 8 పరుగులు, రోహిత్ శర్మ 6 బంతుల్లో 5, సూర్యకుమార్ యాదవ్ 3 బంతుల్లో 6 పరుగులు చేశాడు. దాంతో 2.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ 22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా హిట్టింగ్ చేస్తాడని అనుకున్నా 6 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రూధర్‌ఫోర్డ్ హిట్టింగ్ చేస్తున్నాడు అన్న సమయంలో దేశ్‌పాండే ట్రాప్‌లో చిక్కుకుని వికెట్ కోల్పోయాడు. 8 బంతులు ఆడిన రూధర్‌ఫోర్డ్ 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుటయ్యాడు. నమన్ ధీర్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 7 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో 35 పరుగులు కావాల్సి ఉండగా ముంబై 7 పరుగులు మాత్రమే చేసింది. 11 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 123/9 పరుగులు చేయడంతో రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అందరూ అద్భుతంగా బౌలింగ్ చేయడం విశేషం. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే చెరో వికెట్ తీయగా.. రవి బిష్ణోయ్, బర్గర్, సందీప్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు.