తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్‌ మోగించారు. ఈ నెల 22వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్లు తాజాగా ఆర్టీసీ జేఏసీ ప్రకటన విడుదల చేసింది. గత నెల 13వ తేదీన సమ్మె నోటీసులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సమ్మె నివారణ చర్యలను చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లను ఉంచినట్లు స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు.. కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు కూడా సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌ చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె నోటీసులు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమై చర్చించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురి వెంకన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీని విస్తరించడం మంచిదేనని.. అయితే ఆ పేరుతో సంస్థను నిర్వీర్యం చేయొద్దని కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని.. అయితే అలా చేయడం వల్ల గుత్తేదారుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని.. అందువల్ల వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని సూచించారు.తమవి న్యాయమైన డిమాండ్లు అని.. వాటిని వెంటనే పరిష్కరించాలనే ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ కోరారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం వల్లే.. కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని సమ్మె చేయాల్సి వస్తోందని వివరించారు. సమ్మె విరమణ చర్యలు విఫలమై సమ్మె చేయాల్సి వస్తే.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను తక్షణమే చేపట్టాలని యూనియన్ నాయకులు ఇప్పటికే డిమాండ్‌ చేస్తున్నారు. 30 శాతం ఫిట్‌మెంట్‌తో 2021 వేతన సవరణను అమలు చేయాలని.. అదే సమయంలో ప్రతినెలా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.350 కోట్లలో ఎలాంటి కోతలు, కండిషన్లు లేకుండా రిలీజ్ చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా వేతనాలు, బెనిఫిట్స్‌, సర్వీస్‌ వంటి సమస్యలపై ఆర్టీసీ కార్మికులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. మరింత ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమ్మెకు రెడీ అయ్యారు.