ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి కోటిన్నర కట్నం.. ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో రూమ్‌కి పిలిచి.. అడ్డంగా బుక్కయ్యాడు

Wait 5 sec.

మ్యాట్రిమోనీ వెతుకుతున్న వారిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ఘరానా మోసగాడి ఉదంతం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తనను తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకుని.. ఏకంగా కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మాడుగుల మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన పనస మధు గౌడ్ అనే యువకుడు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి అల్కాపురి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి సెట్ కాకపోవటంతో మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) చర్లపల్లి విభాగంలో గ్రేడ్-3 టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత నల్గొండకు చెందిన ఒక యువతి కుటుంబాన్ని మోసగించేందుకు ప్లాన్ వేశాడు. తన హోదాను నిరూపించుకోవడానికి నకిలీ ఐడీ కార్డును కూడా సృష్టించి తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగనంటూ వారిని నమ్మించాడు. యువతి కుటుంబం ఆర్థికంగా బాగా స్థిరపడిన వారని తెలుసుకున్న నిందితుడు.. తొలుత రెండు కోట్లు కట్నం కావాలని పట్టుబట్టాడు. చివరకు చర్చల అనంతరం కోటిన్నర రూపాయలు కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా వైభవంగా జరిపించారు. అయితే.. నిశ్చితార్థం తర్వాత మధు అసలు స్వరూపం బయటపడటం మొదలైంది. ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని చైతన్యపురిలోని ఒక గదికి పిలిపించిన నిందితుడు మధు.. అక్కడ ఆమెను అనుమానిస్తూ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తీవ్రమైన వేధింపులకు గురిచేశాడు.అతని వింత ప్రవర్తన, వేధింపులతో భయపడిపోయిన యువతి.. వెంటనే తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబం అతడు పనిచేస్తున్నట్లు చెప్పిన ఎఫ్.సి.ఐ కార్యాలయంలో ఆరా తీసింది. అక్కడ పనస మధు పేరుతో ఎవరూ పనిచేయడం లేదని అతను చూపించిన ఐడీ కార్డు నకిలీదని తెలియడంతో అమ్మాయి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. మోసపోయినట్లు గ్రహించి వెంటనే చైతన్యపురి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు పనస మధును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో భారీగా సొమ్మును కాజేయాలని చూసిన ఈ కేటుగాడిని ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చాలా మంది పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లిళ్లు కుదుర్చుకునే విషయంలో అప్రమత్తత అవసరమని అంటున్నారు.