సంగారెడ్డి జిల్లాలో అరుదైన ఖనిజాలు.. పర్వతపూర్ బ్లాక్‌లో టైటానియం, లేటరైట్ నిక్షేపాలు

Wait 5 sec.

సంగారెడ్డి జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) గుర్తించింది. జహీరాబాద్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలోని పర్వతపూర్ ప్రాంతంలో వనేడియం, టైటానియం, అల్యూమినస్ లేటరైట్ వంటి విలువైన ఖనిజ బ్లాకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఖనిజాల వెలికితీత కోసం ఈ-వేలం ప్రక్రియను కేంద్ర గనుల శాఖ ఇప్పటికే ప్రారంభించింది. ఈ వేలంపై జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో నేడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో భారీ రోడ్‌షోను నిర్వహిస్తున్నారు.జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం ప్రకారం.. సుమారు 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న పర్వతపూర్ బ్లాక్‌లో దాదాపు 15.25 మిలియన్ టన్నుల వనేడియం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. వనేడియం అనేది అత్యంత అరుదైన ఖనిజం, దీనిని ప్రధానంగా స్టీల్ తయారీలో బలాన్ని పెంచడానికి, అత్యాధునిక బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. వీటితో పాటు 87 మిలియన్ టన్నుల అల్యూమినస్ లేటరైట్ నిక్షేపాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, రక్షణ రంగం, స్వచ్ఛ ఇంధన సాంకేతికతలకు వెన్నెముక వంటివని నిపుణులు చెబుతున్నారు.దేశవ్యాప్తంగా ఏడో విడతలో భాగంగా వేలం వేస్తున్న 19 కీలక ఖనిజ బ్లాకుల్లో పర్వతపూర్ ఒకటి. ఇందులో టంగ్‌స్టన్, లిథియం వంటి భవిష్యత్ అవసరాలకు కీలకమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. పర్వతపూర్ బ్లాక్ రోడ్డు, రైలు మార్గాలకు చేరువలో ఉండటం వల్ల రవాణా పరంగా పెట్టుబడిదారులకు ఇది గొప్ప అవకాశంగా కనిపిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కితే స్థానికంగా ఉపాధి పెరగడమే కాకుండా.. రక్షణ, పారిశ్రామిక రంగాల్లో భారత్ స్వయంసమృద్ధి సాధించేందుకు తెలంగాణ గనులు కీలక పాత్ర పోషించనున్నాయి. కాగా, ఏపీలోనూ కేంద్రం ఇటీవల ప్రకటించిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు స్థానం దక్కింది. ఈ మేరకు అక్కడ ఖనిజాల కోసం అన్వేషణ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాంథనం, ప్రాసోడైమియం,స్కాండియం, జిక్రోనియం, లిథియం, నియోబియం, నియోడైమియం, సిరియం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖనిజాలను ఎయిర్‌క్రాఫ్ట్స్, స్మార్ట్‌ఫోన్లు, విండ్‌ టర్బైన్స్‌, కంప్యూటర్లు వంటి వాటిలో ఉపయోగిస్తారని తెలిసింది.