ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్‌తో జరిగిన చర్చలు విఫలమైన వేళ.. హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చమురు రవాణాకు కీలకమైన ఈ జలసంధిని సోమవారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలు) దిగ్బంధించనున్నట్లు అమెరికా మిలటరీ ప్రకటించింది. ఈ మూసివేత అనేది ఇరాన్‌కు వెళ్లే నౌకలు లేదా ఇరాన్ పోర్టుల నుంచి నౌకలకు మాత్రమే వర్తిస్తుంది. యూఏఈ, సౌదీ తదితర గల్ఫ్ దేశాలకు వెళ్లే నౌకలను తాము అడ్డుకోబోమని అమెరికా ప్రకటించింది. ఇరాన్ మినహా ఇతర దేశాలకు వెళ్లే నౌకలు మీదుగా స్వేచ్ఛగా ప్రయాణించొచ్చని వెల్లడించింది.ఇరాన్‌ నుంచి రాకపోకలు సాగించే ఏ నౌకలనైనా సరే కచ్చితంగా అడ్డుకుంటామని సెంట్‌కామ్ హెచ్చరించింది. అమెరికా సైన్యానికి చెందిన సెంట్‌కామ్.. ఆఫ్రికా కొమ్ము నుంచి మధ్య ఆసియా, ఇరాన్, ఇరాక్, అప్ఘానిస్థాన్‌తోపాటు అరేబియన్ ద్వీపకల్పం పరిధిని పర్యవేక్షిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్లోరిడాలోని టంపాలో ఉంది.అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వాణిజ్యం, సరకు రవాణా కోసం వెళ్లే నౌకలను తాము అడ్డుకోబోమని సెంట్‌కామ్ ప్రకటించింది. ఇరాన్‌‌కు రాకపోకలను సాగించే నౌకలను అడ్డుకోవాలన్న ట్రంప్ నిర్ణయం.. కేవలం ఇరాన్‌ను మాత్రమే కాకుండా.. ఆ దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలను కూడా ఇబ్బంది పెట్టనుంది. ఇరాన్ నుంచి చైనా పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్నిబట్టి ట్రంప్ టార్గెట్ బీజింగ్ అని అర్థమవుతోంది. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వల్లే ఇరాన్ ఇంకా యుద్ధం చేయగలుగుతోందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడం కోసం ఆయన హార్ముజ్ దిగ్బంధనం దిశగా అడుగులేస్తున్నారు.అంతర్జాతీయ చట్టాల ప్రకారం దిగ్బంధనాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నౌకాయాన చట్టాల్లో ఈ సూత్రం చాలా కాలంగా ఉంది. గతంలో క్యూబా సంక్షోభం సమయంలో.. బ్లాకేడ్ (దిగ్బంధనం) అనే పదం వాడితే సోవియట్ యూనియన్‌‌పై నేరుగా యుద్ధాన్ని ప్రకటించినట్లు అవుతుందనే భయంతో అమెరికా ఉద్దేశపూర్వకంగానే క్వారంటైన్ అనే పదాన్ని వాడింది. అయితే ప్రస్తుతం ట్రంప్ నాయకత్వం అలాంటి పర్యావసనాలను పట్టించుకోకుండా, దేనికి భయపడకుండా దిగ్బంధనం అనే పదాన్ని వాడింది. తద్వారా ఇరాన్‌తోపాటు పరోక్షంగా చైనాను సైతం అమెరికా టార్గెట్ చేసుకుంది.ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90 శాతం చైనానే కొనుగోలు చేస్తోంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ నుంచి రోజుకు 1.5 నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును చైనా దిగుమతి చేసుకుంటోంది. చైనా ముడి చమురు దిగుమతుల్లో ఇది 15-16 శాతం ఇరాన్ నుంచే ఉండటం గమనార్హం.షాడో ఫ్లీట్ అని పిలిచే రహస్య నౌకల ద్వారా ఇరాన్ చమురును రవాణా చేస్తోంది. ఇవి తమకు అనుకూలమైన జెండాలతో ప్రయాణిస్తూ.. యూఏఈ, మలేసియా సమీపంలోని సముద్ర జలాల్లో ఒక నౌక నుంచి మరో నౌకను చమురును మారుస్తుంటాయి. ఆ తర్వాత కార్గోల లేబుళ్లను మార్చేసి చైనాలోని రిఫైనరీలకు తరలిస్తున్నాయి. అమెరికా నిఘాకు చిక్కకుండా ఉండటం కోసం లావాదేవీలను చైనా కరెన్సీ అయిన యువాన్‌లో నిర్వహిస్తున్నాయి.అమెరికా ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాలు ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయడం మానేశాయి. దీంతో చైనా మాత్రమే టెహ్రాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఇరాన్ నుంచి చైనాకు చమురు ఎగుమతి కాకుండా అమెరికా అడ్డుకుంటే.. ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటుంది. ఫలితంగా ఆ దేశ సైనిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.మరోవైపు చైనాకు కూడా ఇరాన్ చమురు ఎంతో అవసరం. ఇరాన్ నుంచి చమురు సరఫరా ఆగిపోతే.. చైనా తన ఇంధన అవసరాల కోసం సౌదీ అరేబియా, రష్యా నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ నుంచి తగ్గింపు ధరలకే చైనా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరాన్ ఎగుమతులతో సంబంధం ఉన్న నౌకలను, ముఖ్యంగా రవాణా కోసం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కు టోల్ కడుతున్నట్లు అనుమానం ఉన్న నౌకలను అమెరికా దిగ్బంధనం చేస్తే.. చైనా ఎనర్జీ సప్లయ్ చైన్ దెబ్బతింటుంది. అందుకే ట్రంప్ ప్రకటన పట్ల బీజింగ్ ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రపంచ ఇంధన మార్గాలను అమెరికా సైనికీకరణ చేయొద్దని చైనా హెచ్చరించింది.అమెరికా హార్ముజ్ దిగ్బంధనం ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదు. ఇరాన్ నుంచి భారత్ చాలా తక్కువగానే చమురు కొనుగోలు చేస్తోంది. అమెరికా తాత్కాలిక వెసులుబాటు కల్పించడంతో.. ఏడేళ్ల తర్వాత ఇటీవలే ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ప్రారంభించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఒక కార్గో నౌక ద్వారా ఇరాన్ చమురు అందింది. 2019కు ముందు భారత్ ఇరాన్ నుంచి 15-20 శాతం చమురును దిగుమతి చేసుకునేది. కానీ అమెరికా ఆంక్షల ప్రభావంతో ఆ దేశం నుంచి చమురు కొనుగోలును పూర్తిగా నిలిపేసింది.హార్ముజ్‌ను దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించగా.. తీవ్ర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. సముద్రంలో అమర్చిన మైన్లు, డ్రోన్ల ద్వారా నౌక రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అన్నంత పని చేస్తే గనుక హార్ముజ్‌ మీదుగా సాగే చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.