ఇండియా తూచ్ అని కొట్టిపారేస్తే.. POK బోర్డర్లో చైనా సైలెంట్‌గా చేసేసింది.. నాలుగు దేశాల కూడలిలో డ్రాగన్ దూకుడు!

Wait 5 sec.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, అప్ఘానిస్థాన్ సరిహద్దులకు చేరువగా ఉండే జిన్‌జియాంగ్ ఫ్రావిన్స్‌లో చైనా కొత్తగా ఓ కౌంటీ (జిల్లా)ని ఏర్పాటు చేసింది. సరిహద్దుల విషయంలో భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ కొత్త కౌంటీకి సెన్లింగ్ అని పేరు పెడుతున్నట్లు జిన్‌జియాంగ్ ఉయ్‌ఘుర్ అటానమస్ రీజియన్ ప్రభుత్వం మార్చి 26న ప్రకటించింది. కాష్గర్ ప్రిఫెక్చర్ నుంచి ఈ కొత్త జిల్లాను పరిపాలించనున్నారు. చైనా ఏర్పాటు చేసిన ఈ కొత్త జిల్లా కారకోరం పర్వత శ్రేణులకు దగ్గరగా ఉండటంతోపాటు.. పాక్ ఆక్రమిత కశ్మీర్, అప్ఘాన్ సరిహద్దులకు చేరువగా ఉంటుంది. దీంతో ఈ కొత్త కౌంటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 2024 డిసెంబర్ నుంచి జిన్‌జియాంగ్ ఫ్రావిన్స్‌లో చైనా ఏర్పాటు చేసిన మూడో కౌంటీ ఇది కావడం గమనార్హం. . ఈ కౌంటీల పరిధిలోని కొన్ని ప్రాంతాలు లడఖ్ పరిధిలోకి వస్తాయని భారత్ స్పష్టం చేసింది. ఆక్సాయ్ చిన్ పీఠభూమిలోని చాలా భాగాన్ని హియాన్ కౌంటీలో భాగంగా చైనా చూపెట్టింది. భారత్ దీన్ని లడఖ్‌లో భాగంగా పరిగణిస్తుంది. అయితే 1962 యుద్ధం తర్వాతి నుంచి ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. ఇప్పటికీ ఈ భూభాగం రెండు దేశాల మధ్య వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.కొత్తగా ఏర్పడిన సెన్లింగ్ కౌంటీకి కేంద్రమైన కాష్గర్.. చారిత్రక సిల్క్ రోడ్‌‌‌పై ఉంటుంది. ఇది చైనాను దక్షిణ, మధ్య ఆసియాతో కలిసి వ్యూహాత్మక ద్వారం లాంటిది. చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్ సైతం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ కారిడార్ పీవోకే మీదుగా వెళ్లడం పట్ల భారత్ అభ్యంతరం చెబుతోంది.భద్రతాపరమైన ఆందోళనలతోనే చైనా ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జిల్లా భౌగోళికంగా అప్ఘానిస్థాన్‌లోని వాఖన్ కారిడార్‌తో అనుసంధానమై ఉంటుంది. షిన్‌జియాంగ్ సరిహద్దులో ఉన్న 74 కిలోమీటర్ల ఈ సన్నని భూభాగం.. తజికిస్థాన్, పీవోకేలను వేరు చేస్తుంది. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్‌కు చెందిన ఉయ్‌ఘర్ మిలిటెంట్లు అప్ఘానిస్థాన్ నుంచి జిన్‌జియాంగ్ ఫ్రావిన్స్‌లోకి చొరబడటానికి వాఖాన్ కారిడార్‌ను వాడుకుంటున్నారని చైనాతో గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల చొరబాట్లను అరికట్టడం కోసమే సరిహద్దుల్లో కొత్త కౌంటీని చైనా ఏర్పాటు చేసిందని భావించొచ్చు. జిన్‌జియాంగ్ వాయువ్య ప్రాంతంలో ముస్లిం ఉయ్‌ఘర్లు, తజిక్‌లు, కిర్గిజ్, కజక్‌లు సహా అనేక మైనార్టీ తెగలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఉయ్‌ఘర్‌, ఇతర ముస్లిం సమూహాలపై చైనా నేరాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. చికెన్ నెక్‌ను యూటీగా చేస్తారని ప్రచారం..వాస్తవానికి . ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో కలిపే సిలిగురి కారిడార్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి, కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటుందని ప్రచారం జరిగింది. ఈ ప్రాంతానికి ఓవైపు బంగ్లాదేశ్ ఉంటే.. మరోవైపు నేపాల్, భూటాన్, చైనా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. బిహార్‌లోని అరారియా, పూర్ణియా, కిషన్‌గంజ్, కటిహార్ జిల్లాలతోపాటు.. బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్, మాల్దా జిల్లాలను కలిపి ఈ కొత్త కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాన్ని నేరుగా తన పాలనలోకి తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, చైనా మాత్రం సరిహద్దుల వెంబడి దూకుడుగా అడుగులేస్తోంది.