తెలంగాణ తన సిబ్బంది సంక్షేమం దిశగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల సామాజిక భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా సహజ మరణం సంభవించినా వారి కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం అందేలా కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న ఆర్టీసీ తాజాగా.. యూబీఐ ద్వారా సహజ మరణానికి రూ.10 లక్షల బీమా కల్పించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI)లో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తుందని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాల్ని ఎండీ నాగిరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో వెలువరించారు. తాజా నిర్ణయంతో ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38 వేల పైగా ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగులకు రూ.10 లక్షల ఆర్థిక భరోసా, ఉద్యోగి సహజంగా మరణించినా బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుందన్నారు. ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మికులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్లు కష్టపడే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి ఇది గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు. సామాజిక భద్రత విషయంలో దేశంలోని ఇతర రవాణా సంస్థల కంటే టీజీఎస్‌ఆర్టీసీ ముందంజలో ఉందని ఈ నిర్ణయం మరోసారి నిరూపించిందని అంటున్నారు. ప్రమాద బీమాతో పాటు, సహజ మరణానికి కూడా రూ.10 లక్షల రక్షణ కల్పించడం రాష్ట్ర రవాణా రంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావడమే కాకుండా.. ఉద్యోగుల క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమని యాజమాన్యం ఈ చర్య ద్వారా స్పష్టం చేసిందని అంటున్నారు.