భూమి అనేది కేవలం ఒక ఆస్తి మాత్రమే కాదని.. అది ప్రతి ఒక్కరి జీవనాధారమని, ఆత్మగౌరవమని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ఆస్తులపై పూర్తి భరోసా కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు' సదస్సులో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే లక్ష్యంతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు పట్టాదారు పాస్‌పుస్తకం రైతులకు ఇచ్చినప్పుడు వారిలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంతా అయిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకండా పోయిందని.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. వాటిని ఇప్పుడు దారిలో పెడుతున్నామని చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో పేదల భూమిపై కన్నేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ అనవసర భూ వివాదాలకు తెరలేపారన్నారు. పట్టా పుస్తకంపైనా అప్పటి సీఎం జగన్‌ ఫొటో వేసుకున్నారని దుయ్యబట్టారు. ఆస్తి ప్రజలదైతే... ఫొటో జగన్‌ది వేసుకున్నారన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతూనే ఉన్నాయని.. వారు చేసిన పనులు చూసి తనకే మతిపోయిందన్నారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపైనే ఆర్జీలు వచ్చేవని అన్నారు. దీంతో ప్రజలకు భూ హక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని చెప్పారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 16,816 గ్రామాలు రీ సర్వే చేయాల్సి ఉందని.. 21.23 లక్షల కొత్త పాస్‌ పుస్తకాలు ఇప్పటికే రైతులకు ఇచ్చినట్లు చెప్పారు. జూలై నాటికి 9 లక్షల పాస్‌ పుస్తకాలు ఇస్తామని.. ఇంకా 80 లక్షల పాస్‌ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. తమ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే పాస్‌ పుస్తకాలను ఎవరూ కూడా తారుమారు చేయలేరన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే ఈ కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలకూ వాడినట్లు చెప్పారు. రైతుల ముందు సర్వే చేయించి రికార్డు చేస్తామన్నారు. ఈకేవైసీ చేశాకే.. రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకం ఇస్తామన్నారు. భూ యజమాని సమక్షంలో మొత్తం ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది తన ఆలోచన అని అన్నారు. రికార్డులు ట్యాంపర్‌ కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చామన్నారు. పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఇచ్చామని.. రైతుల భూమి వేరే ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రికార్డులకు డిజిటల్ లాక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.