ఏపీ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు శాంతిపై అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఏసీబీ అధికారులు శాంతి ఇళ్లల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. తాడేపల్లి, ఉండవల్లితో పాటుగా నాలుగుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. విశాఖపట్నంలోని ఎండాడలో విలాసవంతమైన ఫ్లాట్‌, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం ఉన్నట్లు గుర్తించారు. అలాగే 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండిని సోదాల్లో ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. వీటితో పాటుగా శాంతి వద్ద రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు అకౌంట్‍‌లో మరో రూ.3 లక్షలు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. ఓ కారు, బైక్ కలిగి ఉన్నట్లు సోదాల్లో తేలింది. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు పలు ఆరోపణలపై శాంతి మొన్నటి వరకూ సస్పెన్షన్‌లో ఉన్నారు. 2024 జులై నుంచి 2026 మార్చి నెల వరకు శాంతి సస్పెన్షన్‌లో కొనసాగారు.అయితే, ఇటీవలే ఆమెకు ఉపశమనం లభించింది. శాంతిపై ఉన్న సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తూ, మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాంతిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్రాధాన్య పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ దేవాదాయశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ ఆదేశాలు ఉత్తర్వులు జారీ చేశారు.