హార్ట్ బ్రేక్‌కి కేరాఫ్ అడ్రస్‌గా డేవిడ్ మిల్లర్.. ఆల్‌మోస్ట్ మ్యాచ్‌ని గెలిపించేసి అంతలోనే ఓడించాడు!

Wait 5 sec.

అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ! చేతుల్లో ఉన్న మ్యాచ్‌ని మిల్లర్ మొదటి బంతికే అవుటై సౌతాఫ్రికా ఓటమికి కారణమయ్యాడు. ఎన్నో ఏళ్ల కల కళ్ల ముందే నీరుగారిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నాడు. సేమ్ ఐపీఎల్‌లో కూడా డేవిడ్ మిల్లర్‌కి అలాంటి హార్ట్ బ్రేకే అయింది. ఓడిపోయే మ్యాచ్‌ని గెలుపు అంచుల వరకూ తెచ్చి.. చేజేతులారా ఓటమికి కారణమయ్యాడు. దాంతో మ్యాచ్ అనంతరం చాలా ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మ్యాచ్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ తీసుకొచ్చింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సి రావడం.. స్ట్రయికింగ్‌లో డేవిడ్ మిల్లర్ ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దమయింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. కెప్టెన్ శుభమన్ గిల్ గాయం నుంచి కోలుకుని మ్యాచ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా 45 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగులతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. జోస్ బట్లర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 52.. వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక - కేఎల్ రాహుల్ అద్భుత ఆరంభం ఇచ్చారు. నిస్సాంక 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 41 పరుగులు చేసి అవుటవ్వగా.. కేఎల్ రాహుల్ 92 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. సమీర్ రిజ్వి డకౌట్ అవడంతో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. నితీష్ రాణా 5, అక్షర్ పటేల్ 2, ట్రిస్టన్ స్టబ్స్ 7 పరుగులే చేయడంతో 166కే ఢిల్లీ ఆరు వికెట్లు కోల్పోయింది. ఆఖరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి రాగా.. డేవిడ్ మిల్లర్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 41 పరుగులు బాదాడు. ఆఖరి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులే కావాల్సి రాగా మ్యాచ్ ఢిల్లీదే అని అందరూ అనుకున్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ బౌన్సర్లు వేసి మ్యాచ్‌ని గుజరాత్ వైపు తిప్పాడు. ఆఖరి బంతికి సింగిల్ తీసుకుంటే మ్యాచ్ టై అవుతుందని అనుకున్నా.. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్‌ను కీపర్ బట్లర్ అవుట్ చేయడంతో గుజరాత్ ఒక్క పరుగు తేడాతో గెలిచేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.