ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత.. మెడికల్ మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే.. దాన్ని నయం చేసేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించేవారు. రోగులు కూడా రోజుల తరబడి అవస్థలు పడేవారు. కానీ రోజురోజుకూ టెక్నాలజీ వైద్య వ్యవస్థలోకి అందుబాటులోకి రావడంతో.. పెద్ద పెద్ద ఆపరేషన్లను కూడా డాక్టర్లు సునాయసంగా చేసేస్తున్నారు. ఒకప్పుడు గంటలకు గంటలు పట్టే ఆపరేషన్లు కూడా నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. మరోవైపు.. సక్సెస్ రేటు కూడా అధికంగా ఉండటంతో.. రోగులు త్వరగా కోలుకుంటున్నారు. ఇక ఆపరేషన్లు అవసరం లేకుండా.. శరీరంపై ఒక్క కత్తి గాటు కూడా లేకుండా.. సరికొత్త పద్దతుల్లో రోగులకు డాక్టర్లు నయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) డాక్టర్లు అద్భుతం చేశారు. కర్ణాటక బీదర్‌కు చెందిన ఏడాది వయసు గల బాలుడికి ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా.. అతడి కిడ్నీలో ఉన్న 10 మిల్లీమీటర్ల రాయిని ఏఐఎన్‌యూ డాక్టర్లు తొలగించారు. ఆ బాలుడు గత కొన్నిరోజులుగా విపరీతంగా ఏడవడం.. మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలతో తీవ్ర అవస్థ పడుతున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు స్థానిక డాక్టర్లను సంప్రదించగా.. అతడికి కొన్ని పరీక్షలు నిర్వహించారు. బాలుడి ఎడమ కిడ్నీలో 10 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న ఒక రాయి ఉన్నట్లు డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. దీంతో అతడికి చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ ఆస్పత్రికి తీసుకువచ్చారు.అయితే బాలుడు ఏడాది వయసు వాడు కావడంతో.. సాధారణంగా కిడ్నీలో రాళ్లను తొలగించే ఆపరేషన్ చేస్తే.. ఇబ్బందులు తలెత్తుతాయని డాక్టర్లు దృష్టిలో పెట్టుకుని.. కొత్త విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు. కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ గోపాల్ రాందాస్ తక్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం.. ఆ బాలుడికి అత్యాధునిక ఎక్స్‌ట్రాకార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్) పద్ధతిని ఎంచుకుంది. ఈ విధానంలో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా.. కేవలం లిథోట్రిప్టర్ అనే మెషీన్‌ను ఉపయోగించి హై ఎనర్జీ షాక్ వేవ్స్ ద్వారా కిడ్నీలో ఉన్న రాయిని ఇసుక మాదిరిగా చిన్నగా పొడి చేస్తారు.ఇక అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఉపయోగించి బాలుడికి ఎలాంటి రేడియేషన్ ముప్పు కలగకుండా డాక్టర్లు జాగ్రత్త పడ్డారు. ఈ చికిత్స జరిగిన కొన్ని గంటల్లోనే బాలుడు సాధారణ స్థితికి వచ్చి పాలు తాగడం ప్రారంభించినట్లు తెలిపిన డాక్టర్లు.. అదే రోజు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మాట్లాడిన డాక్టర్ గోపాల్ రాందాస్ తక్.. పిల్లల విషయంలో ఆపరేషన్ల వల్ల కలిగే గాయాన్ని తగ్గించడమే తమ ప్రాధాన్యత అని తెలిపారు. ఈ అత్యాధునిక పద్ధతి కారణంగా ఒక్క కత్తి గాటు లేకుండా.. రక్తపు చుక్క కూడా బయటికి రాకుండా.. అత్యంత సురక్షితంగా బాలుడి కిడ్నీలో ఉన్న రాయిని తొలగించగలిగామని స్పష్టం చేశారు.ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ స్టోన్స్ పెరుగుతున్నాయని.. ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. చిన్నపిల్లల్లో ఎండోస్కోపీ, లేజర్ వంటి ట్రీట్‌మెంట్ పద్ధతులు వారికి ఇబ్బంది కలిగిస్తాయని.. అలాంటి సమయాల్లోనే ఈఎస్‌డబ్ల్యూఎల్ అత్యంత ప్రభావవంతమైన మార్గమని వెల్లడించారు. ఆ బాలుడికి నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయగా.. కిడ్నీలో రాయి పూర్తిగా తొలగినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆ బాలుడు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు.