నెలకు రూ. 10 వేల సిప్ లేదా ఒకేసారి 10 లక్షల పెట్టుబడి.. ఏది బెస్ట్.. దేంట్లో ఎక్కువ వస్తుంది?

Wait 5 sec.

SIP Calculator: పెట్టుబడులు పెట్టేందుకు మన కోసం ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. చాలా మంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇక్కడ రిస్క్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇంకా రిస్క్ కోరుకోని వారు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు వంటివి ఎంచుకుంటుంటారు. ఇక్కడ గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. ఇంకొందరు లాంగ్ రన్‌లో పెద్ద మొత్తంలో రాబడి కోసం.. ఎంచుకుంటుంటారు. ఈక్విటీ సగటున వార్షిక ప్రాతిపదికన చాలా వరకు 12 శాతానికి మించి రాబడి ఇస్తుంటాయని చెబుతుంటారు. ఇక్కడ ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడి స్థోమతకు తగ్గట్లుగా ఆర్థిక క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి వస్తుందని అంటుంటారు. అయితే ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఓకే కానీ.. ఇక్కడ నెలనెలా రూపంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకపోతే ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అని తేల్చుకోలేకపోతుంటారు. ఇక్కడ కొందరి దగ్గర ఒకేసారి పెద్ద మొత్తం అమౌంట్ ఉంటే.. లంప్ సమ్ చేయాలనుకుంటారు.. మళ్లీ అంత అవసరమా.. నెలనెలా సిప్ చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లంప్ సమ్ అంటే అలా పెట్టి వదిలేయడమే.. . అయితే మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నప్పుడు.. సిప్ ఆపేయాలా అని ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వీటి గురించి తెలుసుకునేముందుగా.. సిప్ వర్సెస్ లంప్ సమ్‌పై రాబడి ఎలా వస్తుందో చూద్దాం. పదేళ్ల కాల పరిమితికి చూసినప్పుడు నెలనెలా రూ. 10 వేల చొప్పున సిప్ అనుకుంటే.. మొత్తం కాల పరిమితికి పెట్టుబడి రూ. 12 లక్షలు అవుతుంది. లంప్ సమ్ విషయానికి వస్తే దీనికి దాదాపు సమాన మొత్తం రూ. 10 లక్షల పెట్టుబడి అనుకుందాం. సగటున 12 శాతం వార్షిక రాబడి లెక్కన అంచనా వేస్తే.. నెలకు రూ. 10 వేల సిప్‌పై పదేళ్లకు సుమారు రూ. 22.50 లక్షలు వస్తాయి. అంటే దాదాపుగా మీ పెట్టుబడి రూ. 12 లక్షలు కాస్తా డబుల్ అయిందని చెప్పొచ్చు. ఇదే లంప్ సమ్ విషయానికి వస్తే ఒకేసారి రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వార్షికంగా 12 శాతం రాబడి లెక్కన పదేళ్లలో దాదాపు రూ. 31 లక్షలు వస్తుంది. ఇక్కడ రెండింటి మధ్య తేడా చూస్తే లంప్ సమ్ రూ. 10 లక్షలపైనే రూ. 30 లక్షలకుపైగా రాబడి వస్తుంది. ఇదే సిప్‌లో మొత్తం రూ. 12 లక్షలపైనా రూ. 22 లక్షల వరకే వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. సిప్ అంటే చిన్న మొత్తాల్లో నెలనెలా జమ చేస్తాం కాబట్టి పెద్దగా పెట్టుబడి విషయంలో ఇబ్బంది రాకపోవచ్చు. అదే లంప్ సమ్ అంటే పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసి.. దానిని అలా వదిలేయాల్సి ఉంటుంది. లంప్ సమ్ విషయంలో మొదటి రోజు నుంచే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ పనిచేస్తుంది. అదే సిప్ విషయంలో జమ చేసే మొత్తం పెరుగుతున్న కొద్దీ.. కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతుంటుందని గమనించాలి. కాబట్టి.. ఇక్కడ ఎంత జమ చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత కాలం జమ చేశామన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పదేళ్లు కాకుండా ఇంకా ఎక్కువ కాలం పెట్టుబడుల్ని కొనసాగిస్తే.. సిప్ ఎక్కువ ప్రయోజనాల్ని కలిగిస్తుందని చెబుతుంటారు. మార్కెట్లు పతనమైనప్పుడు.. సిప్ పెట్టుబడులపై ఎక్కువ యూనిట్లు పొందే వెసులుబాటు కూడా ఉంటుంది. లంప్ సమ్‌లో ఇది వీలుపడదు. ఏదేమైనా.. చివరిగా మీ పెట్టుబడి స్థోమత, ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలకు అనుగుణంగా సిప్ లేదా లంప్ సమ్ అనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. గమనిక: పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి.. ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.