బెస్ట్ యాక్టర్‌గా నాగచైతన్యకు మరో ప్రతిష్టాత్మక అవార్డ్.. బెస్ట్ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, ఉత్తమ నటి రష్మిక

Wait 5 sec.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఉత్తమ నటుడిగా మరో ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకోబోతున్నారు. 'తండేల్' సినిమాలో అద్భుతమైన నటనకుగాను 'ఇండియన్‌ నేషనల్‌ సినీ అకాడమీ' (INCA 2026) అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. 'ది గర్ల్‌ఫ్రెండ్‌' సినిమాకి గాను ఉత్తమ నటిగా రష్మిక మందనని ఎంపిక చేశారు. ఇప్పటికే చైతన్య - రష్మిక 'తెలంగాణ గద్దర్ అవార్డ్స్'లో ఉత్తమ నటీనటులుగా పురష్కారాలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐఎన్సీఏలో అదే కేటగిరీలో విజేతలుగా నిలవడం విశేషం. ప్రతీ ఏడాది దేశంలోని పన్నెండు సినీ పరిశ్రమల్ని ఒక తాటిపైకి తీసుకొస్తూ 'ఇండియన్‌ నేషనల్‌ సినీ అకాడమీ' అవార్డులు అందజేస్తుంటారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా మొత్తం 12 భాషల్లో ఈ పురష్కారాలను ప్రకటిస్తుంటారు. 'INCA - 2026'లో గతేడాది విడుదలైన చిత్రాలలో అత్యుత్తమ సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు. తెలుగు నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్‌), ఉత్తమ నటిగా రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌) నిలిచారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి ఉత్తమ దర్శకుడిగా అనిల్‌ రావిపూడి ఎంపికయ్యారు. ఇదే సినిమాలో నటించిన మాస్టర్‌ రేవంత్‌ (బుల్లిరాజు)కి బెస్ట్ కమెడియన్ అవార్డ్ వరించింది.తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. బెస్ట్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలోనూ ఈ సినిమాకే అవార్డు వరించింది. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు విభాగంలో రామ్‌ జగదీష్‌ (కోర్ట్‌) విజేతగా నిలిచారు. తమిళం నుంచి ఉత్తమ నటుడిగా దుల్కర్‌ సల్మాన్‌ (కాంత), ఉత్తమ నటిగా సిమ్రాన్‌ (టూరిస్ట్‌ ఫ్యామిలీ), ఉత్తమ దర్శకుడుగా మారి సెల్వరాజ్ (బైసన్), ఉత్తమ చిత్రంగా 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఎంపికయ్యాయి. కన్నడలో 'కాంతార: చాప్టర్ 1' సినిమాకి ఉత్తమ నటుడు (రిషబ్ శెట్టి), ఉత్తమ నటి (రుక్మిణి వసంత్), ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (రిషబ్ శెట్టి) అవార్డులు వచ్చాయి. మలయాళంలో ఉత్తమ నటుడిగా నివిన్ పౌలీ (సర్వమ్ మాయ) నిలవగా.. 'లోకా: చాప్టర్ 1' ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటి కళ్యాణిగా ప్రియదర్శన్, ఉత్తమ దర్శకుడిగా డొమినిక్ అరుణ్ పురస్కారాలు అందుకోనున్నారు. హిందీ నుంచి ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్(ధురంధర్‌), ఉత్తమ నటిగా యామీ గౌతమ్‌ ధర్‌ (హక్‌), ఉత్తమ చిత్రంగా 'ఛావా', ఉత్తమ దర్శకుడిగా ఆదిత్య ధర్ (ధరంధర్) విజేతలుగా నిలిచారు. 'ఇండియన్‌ నేషనల్‌ సినీ అకాడమీ' అవార్డుల ప్రదానోత్సవ వేడుకని ఏప్రిల్ 16న ముంబైలో నిర్వహించనున్నారు. దీనికి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్టులుగా వ్యవహరించనున్నారు. సీనియర్ రేఖ, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో సహా పలువురు సినీ ప్రముఖులు, అవార్డు విజేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.INCA అవార్డ్స్ - 2026 (తెలుగు) విజేతలు:ఉత్తమ నటుడు - నాగచైతన్య (తండేల్‌)ఉత్తమ నటి - రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్‌)ఉత్తమ దర్శకుడు - అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ చిత్రం - మిరాయ్ ఉత్తమ హాస్యనటుడు - రేవంత్ (సంక్రాంతికి వస్తున్నాం)