పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ విశాఖపట్నంలో ఇద్దరు ఇరాన్ మహిళలపై పడింది. చదువు కోసం వచ్చిన ఇద్దరు మహిళలకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇరాన్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల ఆచూకీ తెలియడంలేదని.. తమను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయనిఅధికారులకు మొర పెట్టుకున్నారు. ఇరాన్‌కు చెందిన జినాబ్‌ మహ్మది, సోల్మాజ్‌ మహ్మది ఉన్నతవిద్య కోసం విశాఖపట్నం వచ్చారు.. వీరిద్దరు పీఎంపాలెంలో నివాసం ఉంటూ బీఫార్మసీ చదువుతున్నారు. వెంట పిల్లల్ని కూడా తీసుకొచ్చారు.. జినాబ్‌కు కుమారుడు, కుమార్తె ఉంటే.. సోల్మాజ్‌కు కుమారుడు ఉన్నారు. వీరిద్దరి కోర్సు కూడా మరో రెండు నెలల్లో పూర్తికానుండటంతో స్వదేశానికి వెళ్లాలని భావించారు. ఇంతలో ఈ వీరిద్దరిపై యుద్ధ ప్రభావం పడి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. జినాబ్, సోల్మాజ్‌లు పది రోజుల క్రితం వరకు వారి కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఆ తర్వాత నుంచి స్పందించడం లేదని, వారి ఆచూకీ దొరకడం లేదంటున్నారు. ఇరాన్‌లోని కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు రాకపోడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు సొంత దేశానికి వెళ్లలేక.. ఇటు విశాఖలో ఉండేందుకు అవసరమైన డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నారు. జినాబ్ భర్త ఇరాన్ సైన్యంలో పనిచేస్తుండగా.. సోల్మాజ్‌ కుటుంబానికి ఇరాన్‌లో వ్యాపారం ఉంది. తమ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం తెలియడం లేదని ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీని సంప్రదించినా సాయం అందలేదని.. తమ దగ్గర డబ్బులు లేవన్నారు. రెండు నెలల నుంచి ఇంటి అద్దె చెల్లించలేదని.. పిల్లల పోషణ కష్టంగా మారిందన్నారు. తాము స్వదేశానికి వెళ్లే వరకు ఇబ్బందులు ఎదురవుతాయని.. తమను ఆదుకోవాలని అధికారుల్ని కోరారు.. విశాఖపట్నంలో డీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇద్దరు మహిళల సమస్యల్ని కలెక్టర్‌కు తెలియజేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈలోపు వారు నివాసం ఉంటున్న ఇంటి యజమాని, చదువుకుంటున్న విద్యా సంస్థతో మాట్లాడి సహకారం అందించాలని డీఆర్వో సూచించామన్నారు. మొత్తం మీద చదువు కోసం వచ్చిన ఇద్దరు మహిళలు విశాఖపట్నంలో కష్టాలుపడుతున్నారు.