అక్కినేని ఫ్యామిలీ సినిమాకి సమంత విషెస్.. బ్లాక్‌బస్టర్‌ అవుతుందంటూ పోస్ట్!

Wait 5 sec.

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్‌’. షానియల్‌ డియో అనే నూతన దర్శకుడు ఈ బైలింగ్వల్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌ 10న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా సందడే కనిపిస్తోంది. చిత్ర బృందం దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి స్టార్ హీరోయిన్ సమంత తన బెస్ట్ విషెస్ తెలియజేసారు. నిర్మాత సుప్రియను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.సమంత సోషల్ మీడియా వేదికగా ‘డెకాయిట్‌’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ, టీమ్‌కు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు. ''సుప్రియ.. నేను మీ కృషిని, పట్టుదలను, సినిమాపై మీకున్న అంకితభావాన్ని స్వయంగా చూశాను. బ్లాక్‌బస్టర్ విజయానికి మీకంటే ఎక్కువగా మరెవరూ అర్హులు కారు. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి. రేపు థియేటర్లలో విడుదల కాబోయే ‘డెకాయిట్‌’ మూవీకి పనిచేసిన అమేజింగ్ టీమ్‌కు, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లకు అభినందనలు'' అని సమంత ఇన్‌స్టాలో స్టోరీలో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం ‘డెకాయిట్‌’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పిస్తోందనే సంగతి తెలిసిందే. యస్.యస్ క్రియేషన్స్ బ్యానర్ పై అక్కినేని మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన సినిమాకి సమంత అభినందనలు తెలపడటం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత గతంలో అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని, నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ తమ కొత్త జీవితాలను ప్రారంభించారు. శోభిత దూళిపాళ్లని చైతూ పెళ్లి చేసుకోగా.. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సామ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఇక ‘డెకాయిట్‌’ విషయానికొస్తే, వైవిధ్యమైన కథాంశంతో రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అడివి శేష్ - మృణాల్‌ ఠాకూర్ తో పాటుగా అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి గ్యానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్నారు. అడివి శేష్ స్క్రీన్ ప్లే రాయగా.. అబ్బూరి రవి మాటలు అందించారు. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.