గేమ్ ఛేంజర్ రషీద్ ఖాన్.. వరుసగా రెండు వికెట్లు, మ్యాచ్ టర్న్ంగ్ పాయింట్ ఇదే!

Wait 5 sec.

చాన్నాళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. ఒకప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ ఆడాలంటే బ్యాటర్లకు హడల్. గూగ్లీలతో వికెట్లు హాంఫట్ అంటూ తీసేసేవాడు. కానీ కొన్నాళ్లుగా రషీద్ ఫామ్ కోల్పోవడమో, బ్యాటర్లకు అలవాటు కావడమో ఏమో కానీ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద జరిగిన మ్యాచ్‌లో మాత్రం మంచి కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గేమ్ ఛేంజర్‌గా మారాడు. కేవలం ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా.. ఐపీఎల్‌లాంటి టీ20 లీగ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రమే ఇవ్వడం. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు 209 పరుగులు సమర్పించుకుంటే అందులో రషీద్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇవ్వడం హైలెట్. పవర్ ప్లేలోనే బౌలింగ్‌కి వచ్చిన రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మళ్లీ ఎనిమిదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి ఐదు పరుగులు ఇచ్చాడు. పదో ఓవర్‌లో కూడా బౌలింగ్‌కి వచ్చిన రషీద్ మొదటి మూడు బంతులను డాట్స్‌గా చేశాడు. నాలుగో బంతిని నితీష్ రాణా బౌండరీ బాదేశాడు. కానీ ఆఖరి రెండు బంతులు మాత్రం మ్యాచ్‌నే మలుపు తిప్పాయి. నాలుగో బంతిని బౌండరీ బాదిన తర్వాత అదే జోష్‌తో ఐదో బంతిని కూడా రాణా హిట్ చేశాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని సాయి సుదర్శన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. నితీష్ రాణా అవుటైన తర్వాత ఢిల్లీ హీరో సమీర్ రిజ్వీ క్రీజులోకి వచ్చాడు. రిజ్వీని తొలి బంతికే బౌల్డ్ చేసి అందర్నీ స్టన్ అయ్యేలా చేశాడు రషీద్ ఖాన్. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఢిల్లీని గెలిపించిన సమీర్ రిజ్వీ వికెట్ తీసి రషీద్ ఖాన్ హీరో అయ్యాడు. దాంతో రషీద్ వేసిన మూడో ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.ఇక రషీద్ ఖాన్ తన ఆఖరి ఓవర్‌గా 14వ ఓవర్‌‌లో బౌలింగ్‌కి వచ్చాడు. తొలి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్ రాగా.. ఐదో బంతికి అక్షర్ పటేల్ వికెట్ తీశాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. కానీ చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయలేక ఢిల్లీ ఓడిపోయింది.