అతనో సెలూన్ షాప్ ఓనర్.. 40 ఏళ్లుగా అదే తన వృత్తి.. సెలూన్ షాప్‌కు రావటం, షాప్ నిర్వహణతో వచ్చే డబ్బులే తనకి ఆధారం. అలాంటి అతనికి ఇటీవల నోటీసులు వచ్చాయి. రూ. 72 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసుల సారాంశం. దీంతో షాక్ తినటం అంతని వంతైంది. ఇదిలా ఉండగానే తన బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లుండి నిలిచిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకుందామని సదరు బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించారు. అక్కడ బ్యాంక్ సిబ్బంది చెప్పిన సమాధానంతో మరింత ఆందోళనకు గురయ్యారు. జీఎస్టీ అధికారుల నుంచి మీ బ్యాంక్ అకౌంట్ నిలిపివేయమని ఆదేశాలు వచ్చాయంటూ బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన సమాధానంతో లబోదిబోమంటున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన శ్రీనివాసరావు.. 40 సంవత్సరాలుగా సెలూన్‌ షాపును నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే శ్రీనివాసరావుకు రూ.72 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులు చూసిన శ్రీనివాసరావు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. విశాఖలో స్క్రాప్ ఐరన్ వ్యాపారం జరిగినట్లు చూపిస్తూ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత శ్రీనివాసరావు బ్యాంక్ అకౌంట్ నిలిచిపోయింది. బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీసిన శ్రీనివాసరావుకు .. జీఎస్టీ అధికారుల ఆదేశాలతోనే మీ బ్యాంక్ ఖాతాను హోల్డ్ చేసినట్లు సిబ్బంది సమాధానం ఇచ్చారు.విశాఖకు వెళ్లి అక్కడ ఉన్న జీఎస్టీ అధికారులను సంప్రదించాలని సూచించారు. అయితే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని.. శ్రీనివాసరావు వాపోతున్నారు. చిన్నప్పటి నుంచి సెలూన్ షాపు నడుపుతున్నానని.. దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్తున్నారు. అయిత శ్రీనివాసరావుకు తెలియకుండా ఆయన పాన్ కార్డు, ఆధార్ కార్డులను ఎవరో దుర్వినియోగం చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. వాటి సాయంతో దొంగ వ్యాపారాలు సృష్టించినట్లు భావిస్తున్నారు. ఇక తనకు న్యాయం చేయాలంటూ శ్రీనివాసరావు కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆధార్, పాన్ వంటి కీలక వివరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.