మరో 5 రోజుల్లో పెళ్లి.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు లక్షల్లో ఖర్చు.. ఆర్థిక ఇబ్బందులతో కాబోయే పెళ్లి కుమారుడు సూసైడ్..!

Wait 5 sec.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్న తరుణంలో.. కాబోయే పెళ్లి కొడుకు బలవన్మరణానికి పాల్పడటం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. కొండాపూర్‌లోని మై హోమ్ మంగళ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఎం. వెంకట కృష్ణ శ్రీసాయి అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలోనే ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికంగా ఒక యానిమేషన్ కంపెనీని నిర్వహిస్తున్న శ్రీసాయికి.. విశాఖపట్నానికి చెందిన యువతితో ఫిబ్రవరి 22న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈనెల 12న వివాహం జరగాల్సి ఉండగా.. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం ఈవెంట్ ఆర్గనైజర్లకు సుమారు రూ.17 లక్షలు చెల్లించేందుకు శ్రీసాయి అంగీకరించారు. ఇప్పటికే ఆయన రూ.10 లక్షలు చెల్లించారు. అయితే పెళ్లికి సమయం దగ్గర పడుతుండటంతో మిగిలిన నిధుల సర్దుబాటు, వేడుక ఏర్పాట్లకు సంబంధించి శ్రీసాయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఒత్తిడి భరించలేక ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.మంగళవారం సాయంత్రం.. శ్రీసాయి కొత్తగూడలో నివసించే తన సోదరుడి మెసేజ్ పంపించాడు. తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నానని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఆందోళన చెందిన సోదరుడు వెంటనే శ్రీసాయి అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. శ్రీసాయి రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. శ్రీసాయి ముందుగా కొన్ని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను తీసుకొని.. ఆ తర్వాత కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి ఖర్చుల భారం, ఆర్గనైజర్ల నుంచి ఒత్తిడి వంటి అంశాలే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా శవమై పడి ఉండటంతో అపార్ట్‌మెంట్ వాసులు, బంధువుల కన్నీరు మున్నీరవుతున్నారు. కోటి ఆశలతో కొత్త జీవితంపై ఎన్నో కలలు కన్న కాబోయే పెళ్లి కూతురు ఊహించని విషాదంతో తీవ్ర మనోవేదనకు లోనవుతోంది.