రూ.16 కోట్ల ఇంజెక్షన్.. చిన్నారి ప్రాణం కోసం మీవంతు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి

Wait 5 sec.

ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన పునర్విక అనే చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతుండగా.. ఆమె ప్రాణాలు దక్కడానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అత్యవసరమైంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, మీడియా, సోషల్ మీడియా అంతా కలిసి #SavePunarvika పేరుతో క్యాంపెయిన్ నిర్వహించి, పాప ప్రాణాలు నిలబెట్టేందుకు అవసరమైన సాయం చేశారు. అయితే పునర్వికలాగే ఇప్పుడు హిందూపురం నియోజకవర్గం లేపాక్షికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి కేయాన్ష్ అద్విక్ ఓ అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. బాలుడి వైద్యం కోసం రూ.16 కోట్ల ఇంజెక్షన్ అవసరం ఉంది. కేయాన్ష్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే, సీనియర్ హీరో స్పందించారు. నటరాజు దంపతుల కుమారుడైన కేయాన్ష్ అడ్విక్ 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్ 2' అనే ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. 2.5 సంవత్సరాల వయసున్న ఈ చిన్నారి, గత 21 నెలలుగా మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ వ్యాధి నయం కావాలంటే ₹16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. అంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబం.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణని కలిశారు. తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టాలని సాయం కోరారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని చలించిపోయిన బాలయ్య.. తనవంతు సహాయం చేశారు. అలానే ప్రభుత్వం తరపున హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారి ప్రాణాలు కాపాడటానికి అందరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ''మన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామ నివాసి నటరాజు దంపతుల కుమారుడు కేయాన్ష్ అడ్విక్ (2.5 సంవత్సరాలు)కి అత్యంత అరుదైన వ్యాధి - స్పైనల్ మస్క్యలర్ అట్రోఫీ టైప్ 2.. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ వైద్యుల ప్రకారం బేబీ కేయాన్స్ అడ్విక్ గత 21 నెలలుగా ప్రాణాపాయమైన ఆ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షక ఔషధం AVXS-101 (Onasemnogene Abeparvovec). ఈ మందు భారతదేశంలో తయారు కావడం లేదు. ఇంజెక్షన్ ధర: ₹16 కోట్లు. ఒక్కసారి మాత్రమే ఇవ్వాల్సిన జీవరక్షక ఇంజెక్షన్. ఈ కుటుంబం నిన్నటిరోజున హిందూపురం పర్యటనలో ఉన్న నాతో వచ్చి కలిసి తమ బిడ్డ పరిస్థితిని తెలియజేసి మనందరి సహాయాన్ని కోరుకున్నారు. నా వంతుగా నేను సహాయం చేస్తూనే, ప్రభుత్వ పరంగా కూడా నా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంత భారీ మొత్తంలో డబ్బును సమకూర్చుకునే పరిస్థితిలో ఆ కుటుంబం లేదు. కావున మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి తమవంతు సాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను'' అని బాలకృష్ణ ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. చిన్నారి తండ్రి నటరాజు బ్యాంక్ అకౌంట్ (Account- 8265662545, Name - A S Nataraj, IFSC - IDIB000J028, Branch - JP NAGAR) వివరాలను పంచుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆడుకోడానికి నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరో పేదలకు వైద్య సాయం చేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు తన నియోజకవర్గంలోని చిన్నారికి సోకిన ప్రాణాపాయ వ్యాధి గురించి తెలుసుకుని, తనవంతు సహాయం చేసారు. ఆ బాలుడిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాలయ్య పోస్టుకు అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్నారి కేయాన్ష్ అడ్విక్ ప్రాణం కోసం తమ వంతు సాయం చేస్తామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫండ్ రైజింగ్ ద్వారా ఇంజెక్షన్ అవసరమైన రూ.16 కోట్లు వీలైనంత త్వరగా అందాలని, ఆ చిన్నారి ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.