నాలాలు, వ‌ర‌ద కాలువ‌ల్లో పేరుకుపోయిన పూడిక‌ను పూర్తి స్థాయిలో తొల‌గిస్తే.. వ‌ర్షాకాలం నివాసాల‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తవని సూచించారు. నాలాల్లో పూడిక తీయ‌డానికి ఎక్కడైనా ఇంటి వాకిలి అడ్డుగా ఉండి.. తప్పనిసరి ప‌రిస్థితుల్లో తొల‌గించాల్సి వ‌స్తే వెంట‌నే ఆ ప‌ని పూర్తి చేసి ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు. అప్పుడే ప్రవాహానికి ఆటంకం తొల‌గుతుంద‌న్నారు. న‌గ‌రంలో ప్రస్తుతం జ‌రుగుతున్న డీ సిల్టింగ్ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్రస్థాయిలో ప‌రిశీలించారు. రహమత్‌నగర్, కృష్ణాన‌గ‌ర్‌, అమీర్‌పేట‌, గాయ‌త్రిన‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల‌తో మాట్లాడారు. నాలాలు, వ‌ర‌ద కాలువ‌ల్లో డీసిల్టింగ్ ప‌నులు జ‌రుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే వ‌ర్షాకాలంలో ఎక్కడా ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. అందుకు గ‌ల కార‌ణాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను స్థానికుల‌తో చ‌ర్చించి అధికారుల‌కు సూచ‌న‌లు చేశారు. 'వేస‌వి కాలం.. ఇదే మంచి అవ‌కాశం.. వ‌ర్షాలు మొద‌లైన త‌ర్వాత పెద్ద ప‌నులు చేయ‌లేం.. ఈ వ‌ర్షాకాలానికి ఎక్కడా వ‌ర‌ద ప్రవహానికి ఆటంకం లేకుండా చూడాలి.' అని అధికారుల‌కు సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా స‌మాచారం ఇవ్వండికృష్ణాన‌గ‌ర్‌, అమీర్‌పేట‌.. ఇలా డివిజ‌న్ల వారీ వాట్సాప్ గ్రూపులు పెట్టి డీసిల్టింగ్ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు స‌మాచారం త‌మ‌కు ఇవ్వాల‌ని స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాల ప్రతినిధులను హైడ్రా క‌మిష‌న‌ర్ కోరారు. వ‌ర్షాకాలం ఇబ్బందులు ప‌డే వారు స‌మ‌స్య ఎక్కడ ఉందో వారికే చాలా స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆ సమస్యకు కార‌ణం, ప‌రిష్కారం కూడా వారికే తెలుసునని చెప్పారు. ఆ స‌మాచారం అధికారుల‌కు చేర‌వేస్తే ప‌రిష్కారానికి చర్యలు తీసుకుంటామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. రహమత్‌నగర్ వంతెన వ‌ద్ద పెద్దమెుత్తంలో పూడిక‌ను తీయ‌డాన్ని ప‌రిశీలించారు. అలాగే కృష్ణాన‌గ‌ర్‌లో వేస‌వి కాలంలోనే మురుగు ర‌హ‌దారుల‌పైకి రావ‌డాన్ని గ‌మ‌నించారు. ప్రతి వంద మీటర్లకు పూడిక తీత ఎలా జ‌రుగుతుంద‌నేది స్పష్టత ఉండాల‌ని సూచించారు. ఇప్పుడు పూడికను మొత్తం తొల‌గిస్తే.. వ‌ర్షాకాలం వ‌ర‌ద ప్రవాహానికి ఆటంకాలు లేకుండా ఉంటుంద‌ని చెప్పారు. ప్రస్తుతం జ‌రుగుతున్న డీ సిల్టింగ్ ప‌నుల్లో ఎక్కడైనా ఇబ్బందులు త‌లెత్తినా.. కావాల్సిన మిష‌న‌రీ అవ‌స‌ర‌మైనా వెంట‌నే ఆ విష‌యాన్ని త‌మ దృష్టికి తీసుకువ‌స్తే స‌మ‌కూర్చుతామ‌ని అక్కడ ప‌నులు పర్యవేక్షిస్తున్న జీహెచ్‌ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారుల‌కు సూచించారు. డీఆర్‌ఎఫ్ సిబ్బంది మీ వెన్నంటే ఉంటార‌ని.. ప‌నుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా స‌హ‌క‌రిస్తార‌ని వెల్లడించారు.