రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ శాఖను తన వద్దే ఉంచుకుని.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ఇప్పటివరకు తెలంగాణలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు అల్పాహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారికి ఇక నుంచి పాలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు పాలు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలు సరఫరా చేయడం కోసం రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ()కి తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్ల ఆర్డర్ ఇచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అంటే జూన్ నుంచి విద్యార్థులకు పాలు సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు పాలు కూడా అందించాలని నిర్ణయించారు. ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులకు పాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు పాలు సరఫరా చేసే బాధ్యతను విజయ డెయిరీకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా విజయ డెయిరీ నుంచి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు కోరగా.. తాజాగా పాలను సరఫరా చేసేందుకు ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు టెట్రాప్యాక్‌లోనే పాలను సరఫరా చేసేందుకు విజయ డెయిరీ రెడీ అవుతోంది. 1వ తరగతి నుంచి 12వ తరగతులు చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం సమయంలో నిత్యం 150 మిల్లీ లీటర్ల నుంచి 200 మిల్లీ లీటర్ల వరకు పాలు అవసరమని.. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిబంధనలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం విద్యార్థులకు 150 మిల్లీ లీటర్లు లేదా 200 మిల్లీ లీటర్ల పాలను టెట్రాప్యాకెట్లలో పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విజయ డెయిరీ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోని గర్భిణీలు, బాలింతలకు విజయ డెయిరీ 200 మిల్లీ లీటర్ల టెట్రాప్యాక్‌లలో పాలను అందిస్తోంది. వీటితోపాటు ఇటీవలె ములుగు జిల్లా పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాలను టెట్రాప్యాక్‌లలో విజయ డెయిరీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ ప్రక్రియ సక్సెస్ కావడంతో మిగిలిన గిరిజన ప్రాంతాలకు.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్న పిల్లలకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.