లులు మాల్‌కు ఆ స్థలం ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లులు మాల్‌కు సంబంధించిన భూమిపై కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో లులు మాల్‌కు ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. లులు మాల్‌కు ఆర్టీసీ స్థలం కేటాయించడం లేదని.. మెమో కూడా దాఖలు చేసినట్లు ఏజీ (అడ్వొకేట్ జనరల్) దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. త్వరలోనే ఈ భూమి రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం లులు మాల్‌కు విజయవాడలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేయగా విచారణ జరిగింది. విజయవాడలో లులు మాల్‌కు ఆర్టీసీ స్థలాన్ని కేటాయించడంపై పిటిషనర్ల తరఫున లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ స్థలాన్ని లులు మాల్‌కు కేటాయించడం లేదని తెలిపింది. అయితే లులు మాల్‌కు విజయవాడలో ఆర్టీసీ స్థలం కేటాయించబోమని ఏజీ చెబుతున్నారని.. అయినా సరే తాము దాఖలు చేసిన పిల్‌పై విచారణను పెండింగ్‌లో ఉంచాలని కోరారు. తాము భూ కేటాయింపు అంశంలో ప్రభుత్వ విధానాన్ని పిల్‌లో సవాల్ చేశామన్నారు. దీంతో ఈ పిల్‌పై తదుపరి విచారణను జులై 1కి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం. అయితే లాయర్ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై విచారణను హైకోర్టు మూసివేసింది.ఏపీ ప్రభుత్వం విజయవాడలో లులు మాల్ కోసం గవర్నర్‌పేట ఆర్టీసీ డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని కేటాయించింది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టులో సవాల్ చేయడంతో.. విజయవాడలో లులు మాల్‌కి కేటాయించిన ఆర్టీసీకి సంబంధించిన ఆభూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.