ఏపీలో పేదలకు శుభవార్త.. 2016కు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను అమ్ముకోవచ్చు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు తీపికబురు చెప్పారు. 2016కు ముందు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇంటి పట్టా పొందినవారికి ఊరట కల్పించింది. 2016కు ముందు పట్టా పొందినవారు దానిని అమ్ముకునేందుకు, రిజిస్ట్రేషన్ చేసే హక్కు కల్పిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు ఈ పట్టాలను గిఫ్ట్‌ డీడ్‌గా ఇచ్చే వెసులుబాటు కూడా కల్పించారు. రాష్ట్రంలో దాదాపుగా 75లక్షలమంది పేదల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూశాఖపై సమీక్ష చేశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎస్‌ సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, ఇతర అధికారులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇతర సర్వీస్ ఈనాంలోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పించనున్నారు. 9.25 లక్షల ఎకరాలకు సంబంధించి ఫ్రీహోల్డ్‌ కింద రిజిస్ట్రేషన్లు నిలిచిపోయింది.. ఈ మేరకు ఈ భూముల యజమానులకు ఊరట కల్పిస్తూ.. త్వరలో పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. 2019లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం సర్వీస్ ఈనాం భూములకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది.. అయితే ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. 22ఏ జాబితా నుంచి విలేజ్ సర్వీస్ ఈనాం విభాగంలోని 1.37 ఎకరాల భూములకు విముక్తి కల్పించనున్నారు.. ఈ మేరకు త్వరలో చట్టాన్ని తీసుకురానున్నారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 80 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జులై తర్వాత మార్చిలోపు పంపిణీ చేయనున్నారు.మొత్తం 13.59 లక్షల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్‌ కింద రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి. అయితే త్వరలో వీటిలో 9.25లక్షల ఎకరాలకు విముక్తి దక్కనుంది.. మిగిలిన భూముల విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ రికార్డు డిజిటలైజ్‌ చేస్తారు.. ఆ తర్వాత భూయజమాని, రైతుల మొబైల్‌కు సాఫ్ట్‌కాపీ పంపుతారు. భూములకు సంబంధించి ఈకేవైసీ తర్వాత రికార్డుల్ని బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో భద్రపరుస్తారు. ఈ మేరకు భూ యజమానులు ఆధార్, ఈకేవైసీ ద్వారా వాటిని లాక్‌ చేసుకోవచ్చు అంటున్నారు. దీంతో యజమానికి తెలియకుండా వాటి రిజిస్ట్రేషన్‌ వీలుకాదు. రహదారులు, భవనాలు, రవాణాశాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు.