డ్రోన్ టెక్నాలజీతో యుద్ధ స్వభావం పూర్తిగా మారిపోయింది. సమకాలీన యుద్ధంలో డ్రోన్ల ప్రాధాన్యత పెరుగుతుండటంతో సైన్యం ప్రత్యేకంగా ఓ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. యుద్ధ సామర్థ్యాలను వ్యవస్థీకృతం చేసే లక్ష్యంతో ఈ యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ కోర్ ఏర్పాటుకు ముందు పాకెట్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఆర్మీ ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. ఇది కొత్త యూఏవీ టెక్నాలజీని పరీక్షించడానికి, శిక్షణకు ఓ కేంద్రంగా పనిచేయనుంది. చైనా, తుర్కియే నుంచి కొనుగోలుచేసిన డ్రోన్ల అనుసంధానానికి ఇది వారిధిగా నిలుస్తుంది. గత కొన్నాళ్లుగా పాకిస్థాన్ తీవ్రమైన అంతర్గత భద్రత సమస్యను ఎదుర్కొంటుంది. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP), ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్థాన్ (IMP) వంటి ఉగ్రవాద గ్రూపులు ఐఈడీలు, ఆత్మాహుతి వంటి సాంప్రదాయ దాడులకు బదులు తక్కువ ఖర్చుతో కూడిన క్వాడ్‌కాప్టర్ డ్రోన్లును వినియోగిస్తున్నాయి. ‘ఈ డ్రోన్లు వినియోగం ముప్పు స్వరూపాన్ని మార్చేసింది. వ్యూహాత్మక స్థాయిలో వీటిని గుర్తించడం, నిర్వీర్యం చేయడం కష్టతరంగా మారింది’ అని మరో మూలం తెలిపింది. ఈ మార్పు భద్రతా సిబ్బంది ప్రాణనష్టం పెరగడానికి దోహదపడిందని కూడా అది పేర్కొంది.చమురు నిల్వలు, కీలక మౌలిక సౌకర్యాలకు డ్రోన్ దాడుల ముప్పు పెరగడం సహా ఉగ్రవాద గ్రూపులు మరింత అధునాతన వైమానిక చొరబాట్లకు పాల్పడటంతో గత వారం పాకిస్థాన్ సైన్యం కూడా ఒక ప్రత్యేక డ్రోన్ నిరోధక విభాగాన్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది.పాక్ ప్రత్యేక ‘కోర్’ను ఏర్పాటుచేస్తుండగా.. భారత సైన్యం అన్ని విభాగాల్లోనూ డ్రోన్ వ్యవస్థలను అంతర్భాగం చేసే వికేంద్రీకృత విధానాన్ని అవలంబిస్తోంది. మారుతున్న యుద్ధ స్వరూపానికి అనుగుణంగా సాంకేతిక, కార్యాచరణ అవసరాలను వివరిస్తూ మానవరహిత వైమానిక వ్యవస్థలు (యూఏఎస్), లోయిటరింగ్ మ్యూనిషన్స్ కోసం దాదాపు 50 పేజీల ‘రోడ్‌మ్యాప్’ను భారత సైన్యం ఈవారం ఆవిష్కరించింది. ఇందులో 30 రకాల డ్రోన్లు, లోయిటరింగ్ మ్యూనిషన్లకు సంబంధించి 80 వేరియంట్లు సాంకేతిక అవసరాలను వివరిచింది.ఆపరేషన్ సింధూర్‌తో సహా ఇటీవలి సంఘర్షణల నుంచి పాఠాలు నేర్చుకుని, సైన్యం డ్రోన్ సామర్థ్యాలను పోరాట దళాలలో ఏకీకృతం చేసింది. ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ (ఏఏసీ) సుదూర యూఏవీ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉండగా, డ్రోన్‌లను వ్యూహాత్మక స్థాయిలో ఎక్కువగా వినియోగిస్తున్నారు.ఆర్మర్డ్ కోర్‌లో దళాల డ్రోన్ల ద్వారా నిఘా, ఖచ్చితమైన దాడులను నిర్వహించడానికి శౌర్య స్క్వాడ్రన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆరు ఆపరేషనల్ కమాండ్‌లలో ప్రాథమికంగా వీటిని ప్రారంభించి, తర్వాత మొత్తం 63 ఆర్మర్డ్ రెజిమెంట్లకు విస్తరిస్తారు. ఇన్ఫాంట్రీలో గతేడాది ప్రారంభించిన అశ్ని ప్లాటూన్లలో నిఘా డ్రోన్లు, దాడులు చేసే లోయిటరింగ్ మ్యునీషన్స్‌తో శత్రువుపై పైచేయి సాధిస్తాయి. ఆర్టిలరీలోని దివ్యాస్త్ర బ్యాటరీలు డ్రోన్ల ద్వారా లక్ష్యాలను గుర్తించి, ఫిరంగులతో అత్యంత వేగంగా దాడులు చేసేందుకు తోడ్పడతాయి.సుదూర లక్ష్యాలను ఛేదించడానికి స్వార్మ్ డ్రోన్లు (Swarm Drones), ఆర్పీఏఎస్ (RPAS) వ్యవస్థలతో శక్తిబాన్ రెజిమెంట్లను ప్రత్యేకంగా రూపొందించారు. మొత్తంగా, యుద్ధ స్వరూపం మారుతున్న కొద్దీ భారత్ తన పూర్తి సైనిక సామర్థ్యానికి సాంకేతికతను జోడిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం ప్రత్యేక యూనిట్ ద్వారా ఎదుర్కోవాలని చూస్తోంది.