చంద్రబాబు కీలక నిర్ణయం.. 22ఏ జాబితా నుంచి ఆ భూములు తొలగింపు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి నారా నాయుడు తీపికబురు వినిపించారు. రెవెన్యూ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 75 లక్షల పేద కుటుంబాలకు ఉపయోగపడేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2027 మార్చి నెల నాటికి 1.12 కోట్ల పట్టాదారు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని లక్షా 37 వేల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను.. 22ఏ జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. మరో లక్ష ఎకరాల ఇతర సర్వీస్‌ ఇనాం భూములనూ ఈ జాబితా నుంచి తొలగించాలన్న చంద్రబాబు.. ఇందుకోసం కోసం కొత్త చట్టం తేవాలని సూచించారు. వీటితో పాటుగా 2016 ఏడాదికి ముందు హౌసింగ్‌ స్కీమ్‌లో పట్టాలు పొందిన ప్రతి ఇంటికి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం భూముల రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పాసుపుస్తకాల స్థానంలో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నారు. ఎలాంటి ఫోటోలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాజముద్రతో రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో వీటిని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. తాజాగా రాష్ట్రంలోని 1.12 కోట్ల పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరోవైపు రోడ్లు, భవనాలు, రవాణాశాఖలపైనా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారుల నిర్వహణ, గుంతలు లేని రహదారులు, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై చర్చించారు. ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో భేటీమరోవైపు ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశమయ్యారు. సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులపై చర్చించారు. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించిన ప్రపంచబ్యాంక్ ప్రతినిధుల బృందం.. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల వల్ల భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని, మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.