ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే?

Wait 5 sec.

General Provident Fund: కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. (GPF) సహా ఇదే కేటగిరీకి చెందిన ఇతర పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికానికిగానూ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 7.10 శాతంగానే ఉండనుంది. 2025- 26 ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు ఇదే స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆర్థిక వ్యవహారాల విభాగం బడ్జెట్ డివిజన్ ఈ వడ్డీ రేట్లకు సంబంధించి తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో.. కేంద్రం ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. అయితే చాలా కాలంగా మాత్రం ఇక్కడ వడ్డీ రేట్లు పెరగట్లేదు. ఈసారి పెరుగుతుందని ఆశించినా.. అలా జరగకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు. >> జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌తో పాటుగా.. ది కాంట్రిబ్యూటర్ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ది ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, ది స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, ది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్), ది ఇండియన్ ఆర్డ్‌నెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఇండియన్ నావల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, ది డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ది ఆర్మ్‌డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ వాటికి కూడా వడ్డీ రేట్లను 7.10 శాతం వద్దే ఉంచింది. జీపీఎఫ్ విషయానికి వస్తే ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసమే ఉద్దేశించిన పొదుపు పథకంగా చెప్పొచ్చు. ఇక్కడ ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం ఆదా చేస్తూ.. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. ఉద్యోగి తన నెల జీతంలో కనీసం 6 శాతం వరకు ఈ జీపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. సంవత్సరానికి రూ. 5 లక్షలు దాటితే పన్ను పరిధిలోకి వస్తారు. ఉద్యోగి మాత్రమే ఇక్కడ డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నగదును జమ చేయదు. కేవలం వడ్డీ మాత్రమే ఇస్తుంది. ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో జమ చేసిన మొత్తానికి.. వడ్డీ కలిపి ఒకేసారి కేంద్రం అందిస్తుంది. అత్యవసర సమయంలో ఇక్కడ జీపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుంది. ఇంకా లోన్ కూడా తీసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఉంటుంది. ఇక్కడ వడ్డీని ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత జమ చేస్తుంది. .