40 ఏళ్ల బంధానికి తెగదెంపులు చేసుకున్నారు. హస్తం పార్టీకి ఈ నేపథ్యంలోనే తాను అయితే .. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. ఇవాళ జగిత్యాలలో పర్యటించడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన జీవన్ రెడ్డిని ఆయన నివాసంలోనే కేటీఆర్ కలవనున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయడం ఆయన కారు ఎక్కనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. జగిత్యాల పట్టణ శివారులో కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. అక్కడి నుంచి జీవన్ రెడ్డి నివాసానికి బైక్ ర్యాలీతో కేటీఆర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు చేరుకోనున్నారు. జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్న తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించి.. ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి కేటీఆర్‌ ఆహ్వానించనున్నారు. అయితే కేటీఆర్, జీవన్ రెడ్డి మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని.. ఇందులో భాగంగానే ఆయన జగిత్యాలలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డికి బుధవారమే కేటీఆర్ ఫోన్ చేసి.. పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో గతంలో కే కేశవరావుకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పదవిని ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలని గులాబీ పార్టీ ఆలోచన చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈనెల 13వ తేదీన లేదా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయిన ఏప్రిల్ 27వ తేదీన జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్-జీవన్ రెడ్డి భేటీ తర్వాత.. దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.