అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురు యువతుల ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Wait 5 sec.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు వెళ్లిన యువతులను మృత్యువు జలపాతం రూపంలో కబళించింది. బలితీసుకోగా.. ఒక యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మూలగుమ్మి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బూర్జ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామానికి చెందిన నలుగురు యువతులు సరదాగా గడిపేందుకు మూలగుమ్మి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతానికి వెళ్లారు. అక్కడ జలపాతం అందాలకు ముగ్ధులైన అమ్మాయిలు.. ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో జలపాతం అంచున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువతులు త్రిష, రత్న కుమారి, పవిత్ర నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి అంజలి నీటిలో మునిగిపోతుండగా గమనించిన స్థానికులు.. ప్రాణాలకు తెగించి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఈ మూలగుమ్మి జలపాతం అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. దీంతో సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో జంబువలస గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్ల ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన యువతులు ఇలా అచేతనంగా పడి ఉండటం చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.పర్యాటక ప్రాంతాలకు, ముఖ్యంగా జలపాతాలు, నదులు, కొండ ప్రాంతాలకు వెళ్లే వారు సెల్ఫీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక ఫోటో కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని కోరుతున్నారు. ఉధృతి ఎక్కువగా ఉన్న సమయాల్లో నీటి ప్రవాహాల వద్దకు వెళ్లడం ప్రమాదకరమని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో.. ప్రమాదకరమైన జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.