TCS Q4 Results: టాటా గ్రూప్‌నకు చెందిన దిగ్గజ ఐటీ సేవల సంస్థ (టీసీఎస్) త్రైమాసిక ఫలితాలను గురువారం స్టాక్ మార్కెట్లు ముగిసిన తర్వాత ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (జనవరి -మార్చి) గానూ కంపెనీ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే నాలుగో త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే ఈసారి కంపెనీ నెట్ ప్రాఫిట్ ఏకంగా 12 శాతం మేర పెరిగింది. అలాగే కంపెనీ ఆదాయం సైతం ఏకంగా 10 శాతం మేర పెరిగింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.70,698 కోట్లుగా నమోదైనట్లు టీసీఎస్ ప్రకటించింది. ఈ క్రమంలో తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త చెప్పింది టీసీఎస్. తమ వాటాదారులకు ఫైనల్ డివిడెండ్ కింద ఒక్కో షేరుకు రూ.31 చొప్పున చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఆమోదం లభించిందని, అయితే, షేర్ల హోల్డర్ల ఆమోదానికి లోబడి ఈ డివిడెండ్ చెల్లింపులు ఉంటాయని పేర్కొంది. గడిచిన నాలుగో త్రైమాసికంలో తమకు మూడు మెగా డీల్స్ లభించినట్లు టీసీఎస్ వెల్లడించింది. ఈ మూడు మెగా డీల్స్ మొత్తం కాంట్రాక్ట్ విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది. 'వరుసగా మూడో త్రైమాసికంలో మేము లాభాలను నమోదు చేశామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. 12 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ విలువ గల మూడు మెగా డీల్స్ అందుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. అలాగే మా 5 పిల్లర్ల వ్యూహం, మా ఏఐ ఆధారిత సేవలు సైతం ఇందుకు దోహదపడ్డాయి.' అని టీసీఎస్ సీఈఓ, ఎండీ కే క్రితివాసన్ పేర్కొన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కంపెనీని మంచి స్థానంలో ఎలా నిలబెట్టాలి, ఏఐని పూర్తి స్థాయిలో ఎలా అందిపుచ్చుకోవాలని అనే అంశాలపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలిపారు. ఒక ఏడాదిలో ఐదు మెగా డీల్సీ సాధించి అత్యధిక డీల్స్ సాధించిన ఏడాదిల్లో ఒకటిగా నిలిచింది. కంపెనీ తన బిల్డ్- పార్ట్‌నర్ -అక్వైర్ విధానం ద్వారా పెట్టుబడులను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోస్టల్ క్లౌడ్, లిస్ట్ ఎంగేజ్‌లను కొనుగోలు చేసి, హైపర్‌వాల్ట్‌ను స్థాపించింది. గత ఆర్థిక ఏడాది 2025-26లో టీసీఎస్ కంపెనీకి మొత్తం రూ.2.67 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూసుకుంటే 5 శాతం మేర ఆదాయం పెరిగింది.